దాదాపు గడిచిన పదిహేనేళ్లుగా తెలంగాణ అంతటా గులాబీ గుభాళింపు కనిపించేది. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా? ఎప్పుడు ఉప ఎన్నిక ఎదురైనా అప్పటి టీఆర్‌ఎస్.. ఇప్పటి బీఆర్‌ఎస్‌కు ఎదురే ఉండేది కాదన్నది అప్పటి వాస్తవం. అయితే గెలవడమా? లేదంటే ప్రత్యర్థికి చెమటలు పట్టించడమా? అన్నట్టు ఉండేది బీఆర్‌ఎస్ హవా. కానీ.. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మొత్తం తారుమారై పోయింది. ఎన్నికలు వస్తే భయపడే పరిస్థితికి బీఆర్‌ఎస్ చేరుకుంది. మొన్నటికి మొన్న ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎదురులేని విధంగా పాలించిన బీఆర్‌ఎస్ పార్టీకి ఈ దుస్థితి రావడంపై ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలోనూ బీఆర్‌ఎస్ దాదాపు అదే స్థితిలో ఉంది. అందుకే ఈ ఎన్నిక విషయంలో బీఆర్‌ఎస్ వణికిపోతోంది.
పార్టీ ఓటమి తర్వాత.. పార్లమెంటు ఎన్నికల్లో ఓసారి జనంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత చాలా కాలం పాటు బయటకు రాలేదు. ఇటీవలే తన ఫామ్‌హౌజ్‌లో నిర్వహించిన సమావేశంలో క్యాడర్‌ను ఉత్తేజ పరిచేలా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టేంత కోపం మీద ఉన్నారని కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. అంతేకాదు.. తాను కొడితే మామూలుగా ఉండదంటూ ఓరకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినంత పని చేశారు. మరి.. ఇదే సమయంలో మొదటినుంచీ పార్టీకి పట్టుకొమ్మలా ఉన్న ఉత్తర తెలంగాణలో జరుగతున్న టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశాన్ని మాత్రం వదిలేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి త్వరలోనే ఎన్నికలు వస్తాయని శ్రేణులు సిద్దంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయం పట్టించుకోకుండా అసెంబ్లీ ఉప ఎన్నికలకు రెడీగా ఉండండి. స్థానిక ఎన్నికలకు సమాయత్తంగా ఉండండి అంటూ క్యాడర్‌కు బోధిస్తున్నారు కేటీఆర్. ప్రత్యర్ధులతో కలబడి నిలబడాల్సిన సమయంలో కాడెత్తేసే విధంగా మాటలు చెప్పడం వెనక దాగిఉన్న మర్మమేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
మరోవైపు.. బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలు వేదికల మీద చెబుతున్న దానికి, గ్రౌండ్‌లో ఉన్న రియాల్టీకి సరిపోవడం లేదని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. లేకపోతే పార్టీకి గుండెకాయ లాంటి చోట జరుగుతున్న ఎన్నికలను గులాబీ పార్టీ ఎందుకు వదిలేస్తుంది? ..? టైట్ ఫైట్ ఇవ్వాల్సిన చోట పెద్ద లీడర్లు లైట్ అన్నట్టుగా ఎందుకు ఉంటున్నారు? అనేది అర్దం కాక పార్టీ క్యాడర్ బుర్రలు హీటెక్కుతున్నాయంటున్నారు. ఎన్నికలు వచ్చాయంటే కారు పార్టీ టికెట్ కోసం ఓ రేంజ్‌లో పోటీ ఉండేది. ఆ పార్టీకి స్ట్రాంగ్ జోన్‌గా పరిగణించే ఉత్తర తెలంగాణలో అయితే టికెట్ వస్తే అదే పదివేలు అన్నట్టుగా ఉండేది. దానికి తగ్గట్టుగానే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీలకు మధ్యే పోటీ అన్నట్టుగా ఉండేది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. గత రెండు దశాబ్దాలుగా చాంపియన్ గా ఉన్న గులాబీ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయాలంటే గుబులు మొదలయిందట. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బరిలోకి దిగకపోవడంపై పలు రకాల చర్చలు జోరందుకున్నాయి.
నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపించే ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అగ్రనేత కేసీఆర్ సహా హరీష్, కేటీఆర్, కవితలు ఈ స్థానం పరిధిలోనే ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. సమకాలీన రాజకీయాల్లో సమర్దవంతమైన స్ట్రాటజీ ఉన్న నేతగా కేసీఆర్‌కు పేరుంది. సర్వేలు, ఒపినీయన్స్ ఆధారంగా పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతాడనే పేరున్న వ్యూహకర్త, ఎన్నికల్లో పోటీకి వెనుకంజ ఎందుకు వేస్తున్నారనేదీ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. వరుస ఓటముల ప్రభావం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల స్థానం ఎన్నికలపై పడిందట. అదీగాక పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అధినేత అనాసక్తిగా ఉండటానికి ఓ కారణమంటున్నారు నేతలు. గత మూడు నెలల నుంచే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. బీఆర్ఎస్ తరపున కూడా పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు. కానీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ గులాబీ పార్టీ నుంచి పోటీ విషయంలో ఎటువంటి సంకేతాలు లేకపోవడంతో పోటీ చేద్దాం అనుకున్నవారు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ తన ఆనవాయితికి భిన్నంగా ఈసారి నామినేషన్ల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారిని బరిలో దింపేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ నేతలు ప్రయత్నాలు చేశారట. అభ్యర్థి సొంత బలానికి పార్టీ మద్దతు తోడైతే విజయం సాధించే అవకాశాలున్నాయని పార్టీ పెద్దలు కేటీఆర్, హరీష్‌లను కన్వీన్స్ చేసే ప్రయత్నాలు చేశారట. ఇదే విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. పోటీ గురించి ఆయనకు వివరించే ప్రయత్నం చేయగా ఆయన మౌనమే ఆయన సమాధానం కావడంతో మిన్నకుండిపోయారట ఆ ఇద్దరు నేతలు. దీంతో చేసేదేమీ లేక ఆశలు వదులుకోవాలని ఉమ్మడి కరీంనగర్ నేతలకు సంకేతాలిచ్చేశారని చెబుతున్నారు.
మరోవైపు నియోకవర్గ స్థాయిలో పట్టించుకోవాల్సిన ఇంచార్జీలు నేతలు తమకేం పట్టనట్టు ఉండటం… ఇప్పుడు పార్టీ కీలకమైన ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నవ్వే వారి ముందు బొక్కా బోర్లా పడ్డట్టుగా మారిందట గులాబీ పార్టీ చోటా మోటా నేతల పరిస్థితి. పైగా అన్ని పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడిలో ఉంటే తమను మాత్రం స్థానిక ఎన్నికలకు సిద్దం కావాలని లీడర్లు పిలుపు నివ్వడంతో పుండు మీద కారం చల్లినట్టుగా మారిందట.అయితే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీకి వెనుకంజ వేయడం వెనక వేరే వ్యూహాలు ఉన్నాయట ఆ పార్టీకి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడి వ్యవహారం కావడం.. నాలుగు ఉమ్మడి జిల్లాలకు తెలిసిన నేత దొరక్కపోవడం ఓ కారణమంటున్నారు. అదీగాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కొన్ని ఉద్యోగాలు ఇవ్వడంతో గ్రాడ్యుయేట్స్ ఆ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నారనే నిర్దారణకు వచ్చారట గులాబీ బాస్. మూడు నెలల క్రితం నిర్వహించిన ఓ సర్వే రిజల్ట్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో బరిలోకి దిగడం లేదనే ప్రచారం సాగుతుంది.