-
అమెరికా పంపించేసిన వారిని అరెస్టు చేస్తారా? ప్రశ్నిస్తారా?
-
ట్రంప్ కూడా వలసదారుడే.. నెటిజన్లు సీరియస్
అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఘనకార్యంతో అక్రమవలస దారులు స్వదేశాల బాట పడుతున్నారు. అలా మొదటివిడతలో ఇండియా వచ్చిన వారిలో 104మంది ఉన్నారు. ఇప్పుడు వారిని ఇండియాలో అరెస్టు చేస్తారా? లేక ప్రశ్నించి వదిలేస్తారా? అనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా రాబోవు రోజుల్లో ఇంకా చాలామంది వస్తారని, ఇది నిరంతర ప్రక్రియని అంటున్నారు.
అయితే వీరిని అమానవీయంగా కాళ్లకు, చేతులకు బేడీలు వేసి పంపించడమనేది మాత్రం క్షమించలేమని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి చరిత్రలో విలువల్లేని, మానవత్వం లేని వ్యక్తిగా మిగిలిపోతాడనే కామెంట్లు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని ఏలిన నియంతలతో పోల్చుతున్నారు.
పొద్దున్న లేస్తే తను మాత్రం ఎన్నో తప్పులు చేస్తాడు, ఆడవాళ్లని వేధిస్తాడు. కోర్టులకెళతాడు. కన్న కూతురిపై కూడా అసభ్యకరమైన జోకులేస్తాడు. మిగిలినవారేమైనా చేస్తే మాత్రం దేశద్రోహులుగా చూస్తుంటాడని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గురివింద గింజ సామెతలా ట్రంప్ పరిస్థితి మారిందని అంటున్నారు.
అసలు విషయం ఏమిటంటే… డొనాల్డ్ ట్రంప్ కూడా వలసదారుడే. ట్రంప్ తండ్రి ఫ్రెడ్ పూర్వీకులు జర్మన్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అలాగే ట్రంప్ తల్లి మేరీ అన్నే కూడా స్కాట్లాండ్ దేశం నుంచి అమెరికాకు వలస వచ్చారు. అప్పుడు వారు వివాహం చేసుకున్నారు.
ఇలా ఇద్దరు వలసదారులైన తల్లిదండ్రులకు ట్రంప్ పుట్టాడు. అంటే జర్మన్-స్కాట్లాండ్ దేశాల వారసుడు. ఇప్పుడీ మహానుభావుడు నేను అమెరికన్ అంటున్నాడని, దేశభక్తి హీరోలా బిల్డప్ లు ఇస్తున్నాడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
ఇలాంటివాడు అమెరికాలో జన్మించేవారికి జన్మతహా లభించే పౌరసత్వ హక్కుని తీసేశాడని దుయ్యబడుతున్నారు. అందరికీ పేర్లు పెడుతున్నాడు. బేడీలు వేస్తున్నాడు, తను మాత్రం మూలాల్ని మరిచిపోయాడని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
అంతేకాదండోయ్…ఈ ఘనాతిఘనమైన వ్యక్తికి ముగ్గురు భార్యలు, వారి నుంచి ఐదుగురు పిల్లలున్నారు. వీరందరి ద్వారా 10 మంది మనవళ్లున్నారు. ఈయన తప్పుల గురించి మాట్లాడుతుంటే నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయితే అమెరికా వెళ్లడం వరకు ఓకే గానీ, అక్కడ అనుమతుల్లేకుండా ఉండకూడదని జయప్రకాష్ నారాయణ్ లాంటివాళ్లు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు వచ్చిన వలసదారులు అమెరికా ఎలా వెళ్లారు? డంకీ రూట్ లో వెళ్లారా? నకిలీ పాస్ పోర్టులతో వెళ్లారా? ఫొటోలు మార్చేసి వెళ్లారా? క్రిమినల్స్ గా ఉండి ఇక్కడ నుంచి ఇతర దేశాలకు పారిపోయారా? ఇలా ఎన్నో అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్ లో అడుగుపెట్టిన 104మంది వివరాలను అటు పోలీసులు, ఇటు ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. వీరికి భారత దేశంలో పెద్దగా చిక్కులు ఎదురు కాకపోవచ్చునని అంటున్నారు.
కాకపోతే ఇంక అమెరికా ముఖం మాత్రం చూడలేరని అంటున్నారు. మరక్కడ వీరి కుటుంబాలు ఉండి ఉంటే మాత్రం కష్టమేనని అంటున్నారు. ఇకపోతే అమెరికా బహిష్కరణకు గురైన వారికి వీసాలు ఇచ్చేందుకు మెజారిటీ దేశాలు అంగీకరించవని చెబుతున్నారు.
ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, స్కెంజెన్ (యూరోపియన్) వంటి దేశాలు వీరికి వీసాలు ఇవ్వవని చెబుతున్నారు. అయితే కొన్ని దేశాలు మాత్రం పదేళ్ల నిషేధం తర్వాత ఇస్తాయని చెబుతున్నారు. ఒకొక్క సందర్భంలో అమెరికా 5 ఏళ్ల తర్వాత కూడా ఇవ్వవచ్చునని అంటున్నారు. దీర్ఘకాలిక నిషేధమైతే ఉండదని చెబుతున్నారు.
సీనియర్ అడ్వకేట్, ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ మాట్లాడుతూ నేర చరిత్ర లేకపోతే మాత్రం 90 శాతం చర్యలు ఉండవని అంటున్నారు. నకిలీ పత్రాలతో వెళితే మాత్రం వాటిని అందించిన ఏజెంట్లకు జైలుశిక్ష తప్పదని అంటున్నారు. అలా ఎంతమందిని, ఎన్ని దేశాలకు పంపించారో లెక్కలు తీస్తారని చెబుతున్నారు.
మొత్తానికి ట్రంప్ చేసిన పనికి నెట్టింట తీవ్ర ప్రకంపనలు వినిపిస్తున్నాయి. నిజాయితీగా, నిఖార్సుగా వెళ్లి, అక్కడ రూల్స్ ప్రకారం ఉన్నవాళ్లకి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవని మేధావులు చెబుతున్నారు.