- మోకాలి గాయంపేరుతో తప్పించారా?
- అభిమానుల్లో అనుమానాలు
- రేర్ రికార్డుకి దగ్గరలో కొహ్లీ
విరాట్ కొహ్లీ…ఇండియన్ క్రికెట్ కి గర్వ కారణం, సచిన్ తర్వాత అంతటి గుర్తింపు పొందిన కొహ్లీ… ఇటీవల ఫామ్ కోల్పోయి, తిరిగి లైనులోకి రావడానికి నానా పాట్లు పడుతున్నాడు. ఈ దశలో రంజీలో కూడా ఆడి లోకల్ బౌలర్లకు వికెట్టు సమర్పించుకున్నాడు. ఈ దశలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో ఆడకపోవడంపై ఎన్నో అవమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కొహ్లీ మోకాలికి గాయమైంది. దాంతో అతను ఆడటం లేదని తెలిపాడు. ప్రపంచలోనే ఫిట్టెస్ట్ క్రికెటర్ గా పేరున్న విరాట్ కొహ్లీకి గాయమా? ఇదంతా కోచ్ గౌతం గంభీర్ పనే అంటూ అతనిపైనా అభిమానులు పడుతున్నారు.
కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడుతూ కొహ్లీ మోకాలికి గాయమైందని నాకూ తెలిసిందని అన్నాడు. నెట్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అసౌకర్యంగా ఉండటం చూశానని అన్నాడు. అయితే కొహ్లీ 90 శాతం ఫిట్ గా ఉన్న మ్యాచ్ లో ఆడిస్తారని పలువురు పేర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్లు ఆడినా ఆడకపోయినా అభిమానులకు స్టార్ క్రికెటర్లు కావాలని నిర్వాహకుల మాటగా చెబుతున్నారు.
2017 నుంచి అంటే 8 ఏళ్లలో విరాట్ కొహ్లీ గాయాల కారణంగా మ్యాచ్ లకి దూరం కావడం ఇది ఆరోసారి అని అభిమానులు పేర్కొంటున్నారు. ఇంతకుముందు మెడనొప్పితో కూడా కొహ్లీ బాధపడ్డాడు.
వయసు రీత్యా కూడా జిమ్ కు సంబంధించి కొన్ని కఠినమైనవి చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా మరి మోకాలి గాయానికి అటు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళతాడా? లేక రెండో వన్డే జరిగే కటక్ వెళతాడా? అనేది ధర్మ సందేహంగా ఉంది.
విరాట్ కొహ్లీ మిగిలిన రెండు వన్డేల్లో ఆడితే మాత్రం అరుదైన రికార్డుకి చేరువయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే తను మరో 94 పరుగులు చేస్తే 14వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటికి 13,906 పరుగులు చేశాడు. ఒకవేళ చేస్తే అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి క్రికెటర్ గా రికార్డులకి ఎక్కుతాడు.
ఎందుకంటే 14వేల పరుగులు పూర్తి చేయడానికి సచిన్ కి 350 ఇన్నింగ్స్ అవసరమైతే, కుమార సంగక్కరకి 378 ఇన్నింగ్స్ పట్టింది. కొహ్లీ మాత్రం 296 ఇన్నింగ్స్ లోనే పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే గాయం మానాలి, జట్టులోకి రావాలి, ఎప్పటిలా మళ్లీ ఫామ్ లోకి రావాలి, 94 పరుగులు చేయాలి. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఎదురుచూడాలి…అని నెట్టింట పోస్టులు వస్తున్నాయి.