- డాలర్ డ్రీమ్స్.. ఓ పీడకల
- క్షణ క్షణం బతుకుభయం
- అడ్డదారుల్లో వెళ్లి చివరకు అరెస్టై..
- దారిలోనే ప్రాణాలొదిలిన మరికొందరు
- ఆకలితో కన్నుమూసిన వారెందరో
- దారి పొడవునా మృత దేహాల నడుమ ప్రయాణం
- ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్లను చీకటి గదుల్లో ..
- పిల్లలు, మహిళలు కూడా..
- స్వదేశంలో కొండంత పెరిగిన అప్పు..
- నిలువ నీడ లేక అలమటిస్తున్న మరికొందరు
డాలర్ డ్రీమ్స్ వేటలో పడి అక్రమంగా అమెరికా వెళ్లి అత్యంత అవమానకర రీతిలో ఇండియాకు తిరిగి వచ్చిన డిపోర్టీల కథలు హృదయ విదారకంగా ఉన్నాయి. ట్రంప్ దెబ్బకు తిరుగుముఖం పట్టిన అక్రమ వలసదారుల్లో 104 మంది డిపోర్టీలు నిన్న అమృత్ సర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. వారందరినీ కదిలిస్తే కన్నీరు పొంగుకొస్తోంది.అమెరికా వెళ్లి సుఖంగా బతుకుతూ నాలుగు రాళ్లు సంపాదించుకుందామనే ఆతృతతో సుదీర్ఘ గంటల పాటు విమాన ప్రయాణం చేసి దక్షిణ అమెరికాకు అక్కడ నుంచి సముద్రంలో ఆటుపోట్లను భరిస్తూ చావో, రేవో అని సాగే బోటు ప్రయాణం, మెక్సికో సరిహద్దులకు చేరుకుని అక్కడ నుంచి దుర్భేద్యంగా ఉన్న మంచుకొండలను దాటుకుని, రహస్య గుహ మార్గాల ద్వారా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన తమకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని అమెరికా అత్యంత అమానవీయంగా వెనక్కు పంపిందని వెనక్కు వచ్చిన వారంతా వాపోతున్నారు. వారిని కదిలిస్తే చాలు కన్నీటి కథలు వెలుగు చూస్తున్నాయి.
అడ్డదారిలో అష్టకష్టాలు
అమెరికాలో ఉంటున్న ఓ యూఎస్ ఏజెంట్ వర్క్ వీసా ఇప్పిస్తానని ఇచ్చిన హామీతో పంజాబ్ తాహిల్ జిల్లాలో ఉన్న హర్వీందర్ సింగ్ అతగాడికి 42 లక్షల సొమ్ము కూడా ముట్టచెప్పాడు. చివరకు వీసా రాకపోగా తనను వేర్వేరు విమానాలు ఎక్కిస్తూ, దింపుతూ ఢిల్లీనుంచి కతార్ కు అక్కడనుంచి బ్రెజిల్ కు తీసుకెళ్లాడు. అక్కడనుంచి పెరూనుంచి అమెరికా వెళ్లే విమానంలో ఎక్కిస్తానని నమ్మబలికాడు. తీరాచూస్తే అదీ లేదు. అక్కడనుంచి మళ్లీ టాక్సీలో కొలంబియాకు చేరుకుని, అక్కడనుంచి పనామాకు చేరుకున్నామని, అక్కడనుంచి షిప్పులో తమను తరలిస్తామని ఏజెంట్ చెప్పాడని తెలిపారు. అక్కడ చివరకు నౌక కూడా లేదని, మరేదో అడ్డదారిలో రెండు రోజులు ప్రయాణింపచేశాడని కొండలు ఎక్కుతూ దిగుతూ కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాక అక్కడ ఓ చిన్న బోటులోకి ఎక్కించారని, సముద్రం మధ్య నుంచి ఆటుపోట్ల మధ్య రిస్కుతో కూడిన ప్రయాణం చేసిమెక్సికో సరిహద్దులకు చేరుకున్నామని బాధితుడు తెలిపాడు. ఈ ప్రయాణంలో తనతో పాటు వచ్చిన మరో ఇద్దరు ఇండియన్లలో ఒకరు చనిపోయారని, మరొకరు పనామా అడవులు దాటుతుండగా ప్రాణాలు వదిలాడని, వెంట తెచ్చుకున్న ఆహారం అయిపోవడంతో ఆకలితో అలమటించి చనిపోయారని చెప్పాడు.
తిండి లేక ఆకలి చావులు
దారాపూర్ గ్రామానికి చెందిన సుఖపాల్ సింగ్ ది మరో అనుభవం. అమెరికాలోకి ఎలాగోలా ప్రవేశించాలన్న ఉత్సుకతతో ఏజెంట్ మాటలు నమ్మి సముద్ర మార్గంలో 15 గంటలు ప్రయాణించి ఆపై 40నుంచి 45 కిలోమీటర్ల దూరం నడిచి కొండలెక్కి, గుట్టలు దాటి, అత్యంత ప్రమాదకరమైన అడవుల గుండా ప్రయాణించినట్లు తెలిపాడు.మార్గ మధ్యంలోనే ఎవరికైనా గాయాలైనా, ప్రాణాలమీదకొచ్చినా దిక్కు దివాణం ఉండదని బోరున ఏడ్చాడు. తాము వెళ్లిన రూట్ లో ఎంతోమంది మృత దేహాలు చూసి భయం వేసిందన్నాడు. ఈ దారిలో తినేందుకు ఏ పళ్లూ, కూరగాయలూ దొరకవన్నాడు. అన్నికష్టాలు పడి మెక్సికో బోర్డర్ కు చేరుకున్న తాను అమెరికాలోకి అడుగుపెడుతుండగా పట్టుకున్నారన్నాడు. వారిని 14 రోజుల పాటు చీకటి జైళ్లలో నిర్బంధించారని,సూరీడు ఎప్పుడొచ్చాడో కూడా తెలీలేదన్నాడు. అక్కడ తనకు వేలమంది పంజాబీ యువకులు, పిల్లలు, కుటుంబాలతో సహా ఇదే పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతూ కనిపించారని అన్నాడు. అందుకే తప్పుడు మార్గాల్లో ఎవరూ అమెరికాకు వెళ్లొద్దని సుఖ్ పాల్ సింగ్ కోరాడు.
భారత్ తిరిగి వచ్చిన 104మంది తొలి విడత బ్యాచ్ లో హర్యానా , గుజరాత్ రాష్ట్రాల నుంచి 33 మంది,పంజాబ్ నుంచి 30 మంది, యూపీ, మహారాష్ట్రల నుంచి ముగ్గురేసి, చండీగఢ్ నుంచి ఇద్దరూ ఉన్నారు.వీరిలో 19 మంది మహిళలు ఉండగా, వారిలో 13 మంది మైనర్లు. వీరిలో నాలుగేళ్ల బాబుతో పాటు ఏడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు.
కాళ్లు, చేతులు కట్టేశారు..
అమెరికా విమానంలో ఎక్కించే ముందు తమ కాళ్లకు, చేతులను కట్టేశారని అమృత్ సర్ ఎయిర్ పోర్టులో తమను దింపాకే ఆ సంకెళ్లు తొలగించారని జస్పాల్సింగ్ తెలిపాడు.తనను కూడా ఓ అమెరికా ఏజెంట్ చట్టబద్ధమైన మార్గంలో అమెరికా పంపిస్తానని చెప్పి రూ.30 లక్షలు తీసుకున్నాడని తనను బ్రెజిల్ తీసుకెళ్లి అక్కడ ఆరునెలలు ఉంచాడని ఆ తర్వాత జనవరి 24న అమెరికా బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది తనను అదుపులోకి తీసుకున్నారని వాపోయాడు.
ఇది మరో విషాదం
ఇక కానూభాయ్ పటేల్ కుమార్తెది మరో కథ.. యూరప్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తానని వెళ్లిన ఆమె అమెరికా ఎలా వెళ్లిందో తెలీదు. ఇప్పుడు ఆమె కూడా అమెరికా డిపోర్టీలలో ఉందని తండ్రి వాపోతున్నాడు.
ఇల్లు పోయే.. అప్పు మిగిలే..
అమెరికాలో సుఖపడతారని, డాలర్లు సంపాదిస్తారని అప్పులు చేసి మరీ రుణాలు తెచ్చి వారికి వీసాల కోసం చెల్లించినట్లు చివరకు అప్పులే ఇప్పుడు మిగిలాయని వారి కుటుంబాలు ఘోషిస్తున్నాయి. పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని భావించి ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి కట్టామని,ఉన్న ఇల్లు, పొలం అమ్మేశామని కానీ ఏజెంట్ మోసగించాడని, తన భర్త డిపోర్టీ గా తిరిగి రావడమే కాదు, ఇప్పుడు తాను పిల్లలు కూడా అప్పుల పాలై నిలువ నీడ లేకుండా అయిపోయామని ఓ మహిళ వాపోయింది.
అందుకే డాలర్ డ్రీమ్స్ కనడం అందరూ మానుకోవాలి.లక్షల్లో అప్పుల పాలై మళ్లీ గోడకు కొట్టిన బంతిలా వెనక్కు తిరిగి రావడం కంటే ఉన్న చోటే మెరుగైన సంపాదనా మార్గాలు అన్వేషించుకోవడం,న్యాయబద్ధంగా బతికేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ అనుభవాలైనా అమెరికా కలలు కనేవారి కళ్లు తెరిపించాలనీ కోరుకుందాం.