24.7 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

ఇచ్చిన హామీలన్నీ పాయె….

  • ఆర్థిక విధ్వంసం జరిగుతోంది
  • 9 నెలల్లో రూ.1.45 లక్షల కోట్ల అప్పులు
  • అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి
  • 2 లక్షల 50 వేల ఉద్యోగాలు మాయం
  • అమరావతి పేరుతో 52వేల కోట్ల అప్పు
  • బడ్జెటరీ అకౌంట్ అప్పులు 80,826 కోట్లు
  • సివిల్ సప్లయిస్ ద్వారా రూ. 8,000 కోట్ల అప్పు
  • ఏపీ ఎండీసీ ద్వారా రూ.5000 కోట్ల అప్పు
  • మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సంచలన ప్రెస్ మీట్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో రూ.1.45లక్ష కోట్ల అప్పులు చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేస్తోందని తెలిపారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలను, చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన మంచి పనులను పనిలో పనిగా వివరించారు. అలాగే ఏపీలో జరుగుతున్న చంద్రబాబు పాలనలో అవకతవకలను ప్రజలకు ఆధారాలతో సహా వివరించారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని చెబుతూనే ఉన్నాను, అలాగే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ హామీలు కూడా బూటకమని ఎట్టి పరిస్ధితుల్లో అమలు చేయలేడని ఎన్నికలప్పుడే నేను చెప్పినా చంద్రబాబు మాయ మాటలను నమ్మి మోసపోయారన్నారు.

చంద్రబాబు పరిపాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని, ఇసుక, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని జగన్‌ ఆరోపించారు. పట్టణాలు, నగరాల్లో పచ్చని కుటుంబాలు నివసించే చోట ఓపెన్ బార్లు, మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చారని, రాత్రిళ్లు అక్కడ తాగి గందరగోళం చేస్తుంటే, మహిళలు, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారని అన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, అక్కడ నుంచి సంపద సృష్టి జరుగుతోందని అన్న చంద్రబాబు ఇప్పుడు అమరావతి 20 ఏళ్లకు గానీ పూర్తి కాదంటున్నారని అంటే అంతవరకు అప్పులు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినాల్సిందేనా? అని జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తన మొదటి విడత పాలనలో ఏమేం చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారో వీడియోలు ప్రదర్శించి వివరించారు. ముఖ్యంగా దావోస్‌ వెళ్లి మన రాష్ట్రానికి ఆ కంపెనీలు తెచ్చా ఈ కంపెనీలు తెచ్చా అని చెప్పారని ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయని జగన్‌ నిలదీశారు. అమరావతిని సింగపూర్‌ చేస్తానని, టోక్యో చేస్తానని, టర్కీ చేస్తనని ఎన్ని దేశాల పేర్లు చెప్పారో వీడియోలు ప్రదర్శించి విమర్శించారు జగన్‌.

వైసీపీ హయాంలో మూడు పోర్టులు ప్రారంభించాను, 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాను, ఇలా ప్రతి ప్రాంతంలో అభివృద్ధికి పునాదులు వేస్తూ వెళ్లానని వివరించారు. తాను చేపట్టిన పనులు పూర్తయ్యి రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించడానికి 20 ఏళ్లు అవసరం లేదని జగన్‌ అన్నారు. ప్రజల కోసమే పనిచేశాను, మా సమయంలో కోవిడ్ వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది, అన్నింటినీ అధిగమించి ప్రజలకు మంచి చేశామని తెలిపారు.  ఇంకా ఏడాది తిరగకుండానే 2.60 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయని అన్నారు. అందులో వాలంటీర్లే 2.25 లక్షల మంది ఉన్నారని అన్నారు. మిగిలిన వాటి లెక్కలు చెప్పారు. మేం ఇచ్చిన పథకాల్లో ఒక్కటీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందా? లేక 2019–23 మధ్య వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందా? అనేది నేషనల్ జీడీపీ చూస్తే తెలుస్తుందని అన్నారు. 2018–19 సమయంలో చంద్రబాబు దిగిపోయే సమయానికి తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంటే, అదే వైసీపీ పాలన ఐదేళ్లలో ఏపీ 15వ స్థానానికి ఎగబాకిందని వైఎస్‌.జగన్‌ గుర్తు చేశారు. గణాంకాలు చూస్తే ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది ఎవరు అనేది తేటతెల్లం అవుతుందన్నారు.

సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలనే సలహాలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక పథకాల విషయానికి వస్తే అమ్మ ఒడి లేదు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం లేదు, విద్యా పథకాలు ఒక్కటి అమలు కావడం లేదు. మళ్లీ ప్రజలందరూ ప్రైవేటు స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు కట్టి చదివించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని జగన్‌ పేర్కొన్నారు. ప్రజలందరూ కూటమి పాలనను గమనిస్తున్నారని తెలిపారు. తప్పకుండా వారికి బుద్ధి చెబుతారని, ఈసారి నుంచి నేను కూడా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. వచ్చేసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని జగన్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈసారి 30 ఏళ్లు పరిపాలిస్తామని, రెడ్ బుక్ పరిపాలనకు చెక్ పెడతామని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com