24.2 C
Hyderabad
Sunday, June 28, 2026

Live Video

spot_img

పాలమూరుకు నీటి విడుద‌ల.. కర్ణాటక గ్రీన్ సిగ్నల్

కర్ణాటకలోని నారాయ‌ణ‌పూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల‌ నీటిని విడుద‌ల చేసి ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్దారామ‌య్య‌ను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధ‌ర్ బాబు కోరారు. సీయం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, వాకిటి శ్రీహ‌రి, గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ .. మంగ‌ళ‌వారం బెంగ‌ళూర్ లో సీయం సిద్దారామ‌య్య‌ను క‌లిసి విన‌తిప‌త్రం ఇచ్చారు. అనంత‌రం నీటి పారుద‌ల శాఖ మంత్రి డీకే శివ‌కుమార్ ను క‌లిసి .. నారాయ‌ణ‌పూర్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి నీటిని విడుద‌ల చేయాల‌ని కోరారు.

ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా వరప్రదాయని ప్రియ‌ద‌ర్శిని జూరాల ప్రాజెక్టు వేగంగా అడుగంటుతోందని, రోజు రోజుకూ నీటి నిల్వలు తగ్గిపోయి నీటిమట్టం పడిపోతోందని వారికి వివ‌రించారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా రైతులు, ప్ర‌జ‌ల‌కు సాగు,తాగునీరు అందించే జూరాల‌ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశాజనకంగా ఉందని,ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ ప్రాంతం తీవ్రంగా సాగు, తాగునీటి కొరతను ఎదుర్కొంటోందని, దీంతో ప్ర‌జ‌లు, రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఫిబ్రవరి 4, 2025 నాటికి నీటి నిల్వ తీవ్రంగా తగ్గిపోయి కేవలం 1.7 టీఎంసీకి చేరిందని, పరిస్థితి ఇలాగే సాగితే నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోతుంద‌నే ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తాగునీటి సరఫరా, పంటలకు అవసరమైన సాగునీటి అవసరాలపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడిందని, పంట‌లు ఎండిపోయే ప‌రిస్థితి నెల‌కొని ఉంద‌ని, లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని నీటి సంక్షోభంపై వారికి వివ‌రించారు.

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు వ‌ర‌ప్ర‌దాయిని అని, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భీమా ప్రాజెక్ట్ వంటి ప్రధాన ప్రాజెక్టులకు నీటిని అందిస్తూ సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తుంద‌ని తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా సుమారు 2.5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీరు అందుతోందని, ప్రస్తుతం పెరుగుతున్న‌ ఉష్ణోగ్రతలు, నీటి నిల్వల తగ్గుదల కారణంగా ప్రస్తుత పంటలకు కనీసం రెండు త‌డులు ఇవ్వాల్సిన అవసరం ఉంద‌ని పేర్కొన్నారు.

అంతేకాక, ఉమ్మ‌డి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 30 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం పూర్తిగా ఈ నీటి వనరుపైనే ఆధారపడి ఉన్నారని, నీటి నిల్వలు త‌గ్గుతుండటంతో గద్వాల్, వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌న్నారు ఈ ప్రాంతానికి తక్షణమే నీటి విడుదల జరగకపోతే, పంట‌లు ఎండిపోయి రైతులు న‌ష్ట‌పోతార‌ని, అదేవిధంగా తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చ‌డం క‌ష్టంగా మార‌నుంద‌ని వివ‌రించారు.

ఇలాంటి ప‌రిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, నారాయ‌ణ‌పూర్ రిజర్వాయ‌ర్ నుంచి త‌క్ష‌ణ‌మే 5 టీఎంసీల నీటిని విడుద‌ల చేసేలా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌కు, డిఫ్యూటీ సీయంకు మంత్రి జూప‌ల్లి విజ్ఞ‌ప్తి చేశారు. నీటిని విడుద‌ల చేయ‌డం వ‌ల్ల తాగునీటి కష్టాలు తీరుతాయ‌ని, యాసంగి పంటలకు కూడా ఢోకా ఉండదని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీకే శివ‌కుమార్.. 4 టీఎంసీల నీటి విడుద‌ల చేస్తామ‌ని భ‌రోసానిచ్చిన‌ట్లు మంత్రుల‌ బృందం తెలిపింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com