ఉత్తరప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా జరుగుతోంది. ప్రయాగ్‌రాజ్ వేదికగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మునులు, రుషులు, సాధువులు కూడా ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాగరాజ్‌కు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొని గంగా, య మునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు.
ఈ పవిత్రమైన ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెళ్తున్నారు. నరేంద్రమోదీ.. రేపు అంటే.. ఈనెల 5వ తేదీ బుధవారం ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. కుంభమేళా ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాక కోసం ఉత్తరప్రదేశ్ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఉదయం 10 గంటలకు మహా కుంభమేళాకు చేరుకుంటారు. ఇక్కడి నుండి ఆయన అరయిల్ ఘాట్ నుండి పడవ ద్వారా త్రివేణీ సంగమ ప్రదేశానికి వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు గంటసేపు ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి.
బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బమ్రౌలి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తరువాత, ఆర్మీ హెలికాప్టర్‌లో అరయిల్‌లోని డిపిఎస్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌కు వెళ్తారు. అక్కడి నుండి కారులో విఐపి జెట్టీకి వెళ్తారు. అక్కడి నుండి నిషాదరాజ్ సంగమంలో స్నానం చేయడానికి క్రూయిజ్ ద్వారా వెళ్తారు ప్రధాని నరేంద్రమోదీ.