36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

సర్వే ఆధారంగా సంపదను వినియోగిస్తాం – డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల సర్వే నివేదికలో వెల్లడైన అంశాలు, పర్సెంటేజీల ఆధారంగా సంపదను అర్హులందరికీ వినియోగిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే నివేదికను డిప్యూటీ సీఎం భట్టి.. శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికను సమగ్రంగా సభ్యులకు వివరించారు. అలాగే, పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సందేహాలు నివృత్తి చేశారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్‌ తెగలు, వెనుకబడిన తరగతులు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పన చేయడానికి ప్రభుత్వం కుటుంబ సర్వే సమాచారాన్ని ఉపయోగిస్తుందన్నారు. రాష్ట్రంలో మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతం అని సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా తేలిందన్నారు. ఈ సంఖ్యల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, బడ్జెట్లో కేటాయింపులకు సర్వే సమాచారాన్ని వినియోగిస్తామని భట్టి తెలిపారు. సర్వే సమాచారం ఆధారంగా సమగ్రత, పారదర్శకత ప్రాతిపదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని ఈ సర్వే సూచిస్తుందన్నారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో చాలా చేయబోతున్నామన్న ఉప ముఖ్యమంత్రి.. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రజల వివిధ రకాల స్థితిగతులపై ఫుల్ బాడీ చెకప్ ఒక ఎక్సరే లాంటిదన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 3.56 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని, ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు ఉన్నారన్నారు. వారు ఇప్పటికైనా ఆసక్తి కనబరిచి సమాచారం ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భట్టి చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఒకేరోజు ఆరు గంటల్లో సర్వే పూర్తి చేశామన్నారని, అసలు మీరు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఏం చేసుకున్నారో.. ఎవరికీ తెలియదన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారంగా చేసి ఉంటే సభలో పెట్టాల్సి ఉంటుందని, బహిరంగంగా ప్రకటన కూడా చేయలేదు కాబట్టి.. అది అధికారిక డాక్యుమెంట్ ఎలా అవుతుందని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగణనపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సైంటిఫిక్ సర్వే జరగలేదన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిదని చెప్పారు. సర్వే ఆధారంగా రాష్ట్ర వనరులు సంపదను అభివృద్ధికి కావలసిన విధంగా వినియోగిస్తామన్నారు. రాజకీయ, విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వారిని గుర్తించి ఆ వర్గాల ప్రగతికి వినియోగిస్తామన్నారు. బలహీన వర్గాలకు మేలు జరగాలన్న ఆలోచన ఉండదు కాబట్టి.. బీఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై నమ్మకం ఉండదని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాస్ట్రంలో 4 ఫిబ్రవరి 2024న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 16 ఫిబ్రవరి 2024న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని, 10 అక్టోబర్ 24న ఈ సర్వే కోసం జీవో విడుదల చేశామన్నారు. సర్వే పర్యవేక్షణకు సీనియర్ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన 19 అక్టోబర్ 2024న కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని సర్వే షెడ్యూల్ రూపొందించామని భట్టి విక్రమార్క చెప్పారు. హౌస్ లిస్టింగ్ షెడ్యూల్, సర్వే షెడ్యూల్, ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.

సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు, ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలకు.. క్షేత్రస్థాయిలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి తద్వారా 94,261 బ్లాక్ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్‌కి ఒక ఎన్యుమరేటర్‌ను అలాగే, ప్రతి పదిమంది ఎన్యూమరేటర్లను పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ ను నియమించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించడం జరిగిందన్నారు. 6 నవంబర్ 2024న హౌస్ లిస్టింగ్ ప్రారంభమైందన్నారు. 8 నవంబర్ వరకు మూడు రోజులపాటు హౌస్ లిస్టింగ్ పూర్తిచేసి.. అసలైన సర్వే 9 నవంబర్ 2024 నుంచి తెలంగాణ గవర్నర్‌తో ప్రారంభమైందన్నారు. సర్వే మొత్తం 50 రోజుల్లో పూర్తయిందని, సర్వే పూర్తయ్యే సమయానికి గ్రామీణ ప్రాంతాల్లో 66,99,62 నగర ప్రాంతాల్లో 45,15,532 మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,1134గా ఉందన్నారు.

రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగిందన్నారు భట్టి విక్రమార్క. ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఇలా ఉందని చెప్పారు. ఎస్సీలు 61,84,3119 మంది ఉండగా ఇది మొత్తం జనాభాలో 17.43 శాతం అని చెప్పారు. అలాగే, బిసిలు (ముస్లిం మైనారిటీలు మినహా) 1,64,09,179 మంది ఉండగా ఇది జనాభా మొత్తంలో 46.25 శాతం అని వివరించారు. ముస్లిం మైనార్టీలలో మొత్తం 44,57,012 మంది ఉండగా ఇది మొత్తం జనాభాలో 12.56 శాతంగా ఉందన్నారు. ముస్లిం మైనారిటీలలో బీసీలు 35,76,588 మంది ఉండగా వీళ్లు మొత్తం జనాభాలో 10.08 శాతమని చెప్పారు. ముస్లిం మైనారిటీలలో ఓసీలు 8,80,424 మంది ఉండగా వీళ్లు మొత్తం జనాభాలో 2.48 శాతంగా ఉన్నారని చెప్పారు. ఇక, ముస్లిం మైనారిటీలు మినహా ఓసీలు 47,21,115 మంది ఉండగా రాష్ట్రంలో ఓసీల సంఖ్య మొత్తం జనాభాలో 13.31 శాతంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com