29.2 C
Hyderabad
Monday, April 20, 2026

Live Video

spot_img

కోనసీమ రైతులకు సిరులు కురిపిస్తోన్న కుంభమేళా

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అంగరంగవైభవంగా జరుగుతోంది. కోట్ల మంది ప్రజలు త్రివేణి సంగమానికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడ నదీమాతకు కురిడీ కొబ్బరిని ప్రసాదంగా సమర్పిస్తున్నారు. అక్కడి ఆలయాల వద్ద కూడా కొబ్బరి కాయలు కొడుతున్నారు. మరి.. అక్కడ షాపుల్లో అమ్ముతున్న కొబ్బరికాయలన్నీ ఎక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయో తెలుసా? కేరళను తలపించే కోనసీమ ప్రాంతం నుంచే. వందల లారీల సరుకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే అత్యధికంగా ఈ కొబ్బరి కాయల సరఫరా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ కుంభమేళా పుణ్యమాని కోనసీమలో కురిడీ కొబ్బరి ధర ఒక్కసారిగా పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రతి రోజూ దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి వందల సంఖ్యలో లారీల ద్వారా కొబ్బరి ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే, ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాలో నదీమతల్లికి కురిడీ కొబ్బరి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. దీంతో ఒక్కసారిగా కురిడీ కొబ్బరికి డిమాండ్‌ పెరిగింది. చాలా కాలం ఆశించిన స్థాయిలో ధర లేక ఇబ్బందులు పడ్డ కోనసీమ కొబ్బరి రైతులు కుంభమేళా కారణంగా లాభాల్లోకి వెళ్తున్నారు. ఎంతలా అంటే కొబ్బరి మార్కెట్‌లో ధర రూ.18 వేలు నుంచి రూ.20 వేలు వరకు పలుకుతుండడంతో గతంలో ఈ స్థాయి ధర ఎప్పుడూ పలకలేదని అంబాజీపేట కొబ్బరి వ్యాపారులు చెబుతున్నారు. కురిడీ కొబ్బరి కేవలం నూనె అవసరాలకోసమే ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 100 నుంచి 300 లారీల వరకు కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు, రైతులకు, వినియోగదారులకు గతంలో కేవలం రూ.7 వేలకు పడిపోయిన కొబ్బరి లోడ్‌ ధర ఇప్పుడు రూ.18 వేలుకు పైబడి పలుకుతోంది. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొబ్బరి రైతులు. దీనికి కారణం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొబ్బరి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీంతో, కోనసీమ కొబ్బరికి అమాంతంగా డిమాండ్‌ పెరిగింది. కుంభమేళాతో ఇప్పుడు డిమాండ్‌ బాగా పెరగడంతో కొబ్బరి రైతుల వద్ద కురిడీ కొబ్బరి కొరత తలెత్తుతోందని రైతులు చెబుతున్నారు. కొబ్బరి తోటల్లో పలు రకాల తెగుళ్లతో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొబ్బరి తోటల సస్యరక్షణ చర్యలకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా.. ఇన్నాళ్లుగా ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో నష్టపోయేవాళ్లమని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు కొబ్బరి ధర అమాంతంగా ఎగబాకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో కోట్ల మంది భక్తులు కొబ్బరిని కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com