మహిళా సాధికారత సమాజ అభివృద్ధికి చాలా ముఖ్యమైనదని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పేర్కొన్నారు. మహిళా సాధికారత లేకుండా స్థిరమైన భవిష్యత్తును ఊహించలేమని సమాన అవకాశాలు కల్పించేందుకు మహిళలకు సుస్థిర భవిష్యత్తును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి భాగస్వాములు అని గవర్నర్ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాలు, స్కిల్ యూనివర్శిటీ ద్వారా మహిళలకు వృత్తిపరమైన నైపుణ్యాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీధర్ బాబు అన్నారు. టైర్2, టైర్3 నగరాలు, పట్టణాల నుంచి వచ్చిన మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
వీ హబ్ సీఈఓ సీతా పల్లచోల్లా మాట్లాడుతూ భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన మొట్టమొదటి సంస్థ వీహబ్ అన్నారు. మహిళల వ్యాపార అభివృద్ధికి అవసరమైన వనరులు అందించడంతో పాటు, సమాజంలో విస్తృత స్థాయిలో మార్పును తీసుకురావడమే వీ హబ్ ప్రధాన లక్ష్యమన్నారు. మహిళలు ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగస్వాములు కావడం ద్వారా, రాష్ట్ర జీడీపీ పెరిగే అవకాశాలు ఉంటాయని సీఈఓ సీత అన్నారు.