తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ఎమ్మెల్యేగా కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలంటూ ఈ నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సంస్థ ప్రధాన కార్యదర్శి విజయ్‌పాల్.. తమ అడ్వకేట్ ద్వారా ఈ నోటీసులు పంపించారు.
బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నేత అయి ఉండి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం ప్రజల ప్రయోజనాలను విస్మరించడమేనని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి.. పరిష్కరించాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంటున్నారని అసోసియేషన్ ఆరోపించింది. ఈమేరకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి.. కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాన ప్రతిపక్ష నేతగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని కేసీఆర్‌కు అసెంబ్లీలో సభ్యునిగా.. అంటే ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తన లీగల్ నోటీసుల్లో పేర్కొంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వంతో కేసీఆర్ పోరాటం చేయాల్సి ఉండగా.. ఆ బాధ్యతనుంచి తప్పుకోవడాన్ని ఫెడరేషన్ తప్పుబట్టింది. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని, అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్‌పాల్ సూచించారు. లేకుంటే.. అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ కూడా కేసీఆర్‌కు నోటీసులు జారీచేసి వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటిరెండు పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్లపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది. కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు కావస్తున్నా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. మొన్నటి ఎన్నికల తర్వాత కేవలం ఒకే ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ పరిణామాలతో ఇప్పుడు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మరి.. ఈ లీగల్ నోటీసులకు కేసీఆర్ ఎలా సమాధానమిస్తారో చూడాల్సి ఉంది.