37.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

అమెరికాలో మరో ప్రమాదం – ఇళ్లపై కుప్పకూలిన విమానం

అమెరికాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఓ విమానం ఇళ్లమీద కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ షాపింగ్‌మాల్‌తో పాటు.. పలు ఇళ్లు, భవనాలు, కార్లు దగ్ధమయ్యాయి. ఫిలడెన్ఫియాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ షాపింగ్‌ మాల్‌ సమీపంలోని ఇళ్లపై కుప్పకూలింది. దీంతో, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

అయితే, ఈసారి కుప్పకూలిన విమానం చిన్న విమానం. ఆ సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది, ఇద్దరు డాక్టర్లు, ఒక పేషెంట్‌ ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వాళ్లు చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ విమానం ఇళ్లపై కుప్పకూలడం, పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, ఇళ్లన్నీ మంటల్లో చిక్కుకోవడంతో ప్రాణనష్టం ఎక్కువగానే ఉండొచ్చునని భావిస్తున్నారు.

 

విమాన ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు.. రెస్క్యూటీమ్‌లు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టారు. అగ్నిమాపక సిబ్బంది సైతం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ – ఎఫ్ఏఏ వెల్లడించింది. లియర్ జెట్ 55 విమానం.. ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి మిస్సౌరీలోని స్ర్పింగ్ ఫీల్డ్ – బ్రాన్సన్ నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్తోంది. అయితే లియర్ జెట్ టేకాఫ్ అయిన కాసేపటికే సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా ఫిలడెల్ఫియాలోని ఓ షాపింగ్ మాల్ వద్ద కుప్పకూలింది. సహాయం చేయడానికి అన్ని రెస్క్యూ బృందాలు వెళ్లినట్టు ఎఫ్‌ఏఏ తెలిపింది. క్రాష్ సైట్ ఈశాన్య ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుండి 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. ఇక్కడినుంచి ప్రధానంగా వ్యాపార జెట్‌లు, చార్టర్ విమానాల రాకపోకలు సాగుతాయి.

ఈ విమాన ప్రమాదంపై కామన్‌వెల్త్ ఆఫ్ పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాప్రియో కూడా స్పందించారు. తాను ఫిలడెల్ఫియా మేయర్‌తో మాట్లాడానని.. పరిస్థితిని నిశితంగా అంచనా వేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బాధితులకు సాయం చేస్తూ ఆస్పత్రులకు తరలిస్తున్నామని.. మంటలు ఆర్పేందుకు కూడా పెద్ద ఎత్తునే ఏర్పాట్లు సాగుతున్నాయని స్పష్టం చేశారు.


అమెరికాలో గత కొద్దిరోజులుగా వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం వాషింగ్టన్‌ డీసీలో ఓ విమానం ప్రమాదానికి గురయ్యింది. రోనాల్డ్‌ రీగన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఓ ఆర్మీ హెలికాస్టర్‌ పౌరులతో ప్రయాణిస్తున్న విమానాన్ని ఢీకొట్టింది. గాలిలో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. దీంతో, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం తర్వాత హెలికాప్టర్‌, విమానం కూడా కింద ఉన్న పొటామక్ నదిలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌, విమానంలో ఉన్న మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన రెండు రోజులకే మరో ప్రమాదం జరగడంతో అమెరికా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com