- తెలంగాణను స్కిల్స్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్‌గా మార్చడమే లక్ష్యం
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణను స్కిల్స్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్‌గా తీర్చి దిద్దేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లో డార్క్ మేటర్ టెక్నాలజీస్ పేరిట కెనడాకు చెందిన కన్స్టలేషన్ సాఫ్ట్ వేర్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే నైపుణ్యమున్న మానవ వనరులు అవసరమన్న శ్రీధర్‌బాబు కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకున్న తర్వాత తమ అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇస్తున్నాయని పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చదువుకునే సమయంలోనే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి చదువు పూర్తయ్యే నాటికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. దీనివల్ల పరిశ్రమలకు డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. మన దగ్గర టాలెంట్ కు కొదువ లేదు తక్కువ పెట్టుబడితో అద్భుత ఆవిష్కరణలను చేసే సత్తా ఉన్నా డీప్ సీక్ లాంటి అధునాతన ఆవిష్కరణలను చేయలేకపోతున్నామని అన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమలు ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ యువత కూడా నైపుణ్యాలను పెంచుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున మద్దతుగా ఉంటామని మీకు ఉపాధి కల్పించే బాధ్యతను తీసుకుంటామని ఆయన వివరించారు.
జీసీసీలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయని ఈ ఏడాది వాటి విలువ 46 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లుగా ఆర్థికవేత్తలు వెల్లడించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది 60 బిలియన్ డాలర్లు, 2030 నాటికి 100 బి.డాలర్ల మార్క్ దాటుతుందని ఆర్ధికవేత్తలు అంచనా వేయడం ఆనందంగా ఉందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జీసీసీలపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్‌ఎకానమీగా మార్చే లక్ష్యంలో వీటిని భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ ను జీసీసీల హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 400 జీసీసీలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మరికొన్ని ప్రముఖ సంస్థలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి అని పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ ఎస్ ఐ) కు చెందిన 5 జీసీసీలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఈ రంగంలో 10 లక్షల మంది నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బీఎఫ్ ఎస్ ఐ కన్సార్షియం సహకారంతో డిగ్రీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం నుంచే సంబంధిత సబ్జెక్టులను బోధిస్తున్నామన్నారు. పట్టా చేతికి వచ్చే నాటికి వారంతా నిపుణులుగా తయారవుతారని ఫలితంగా చదువు పూర్తయ్యే నాటికే ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో కంపెనీలను స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి ప్రకటించారు. త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించబోతున్నాం. కెనడాకు చెందిన కన్స్టలేషన్ సాఫ్ట్ వేర్ లో వేయికి పైగా కంపెనీలున్నాయని ఈ సంస్థ భారత్ లోనే తన మొదటి జీసీసీని హైదరాబాద్ లో డార్క్ మేటర్ టెక్నాలజీ పేరిట ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఈ సెంటర్ వల్ల 800 మందికి ఉపాధి కలుగుతుందని భవిష్యత్తులో ఈ సంఖ్య 2వేలకు చేరుతుంది అని ఐటీ శాఖ మంత్రి దుద్ది్ళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. కార్యక్రమంలో కన్ట్సలేషన్ సర్వీసెస్ (పెర్సస్ డివిజన్) ప్రెసిడెట్ స్కాట్ స్మిత్, డార్క్ మేటర్ టెక్నాలజీస్ సీఈవో, సీఆర్వో సీన్ డుగాన్, చీఫ్ రిస్క్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ మైకేల్ హాక్, డార్క్ మేటర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.