ప్లేస్ మారినా… ప్లేయర్స్ మారినా… డొమెస్టిక్ అయినా… ఇంటర్నేషనల్ అయినా… మన టీమిండియా ప్లేయర్స్ ఆట కాస్త అయినా మారడం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం కొనసాగుతున్న రంజీ మ్యాచ్‌లు. సొంత గడ్డపై న్యూజిలాండ్ సిరీస్ పోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజారిపోయింది. WTC ఫైనల్ చాన్స్ పోయింది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ పోయింది. ఇలా ఈ మధ్య కాలంలో అన్ని పోవడమే కానీ వచ్చింది మాత్రం ఏం లేదు. అయినా కానీ టీమిండియాలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేవు. చేయక చేయక టీమిండియా ప్లేయర్సంతా రంజీ మ్యాచ్‌లు ఆడాల్సిందేనని ఓ మెలిక పెడితే. మన దిగ్గజ ప్లేయర్లంతా కుర్రాళ్ల చేతిలో కూడా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
రైల్వేస్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. మెడనొప్పి కారణంగా మొదటి మ్యాచ్ ఆడకపోయినా రైల్వేస్ మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉండి ఆడుతున్నాడు. జస్ట్ కోహ్లీ ఆటను చూసేందుకు ఢిల్లీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఓ రంజీ మ్యాచ్‌కు ఈ రేంజ్‌లో ప్రేక్షకులు రావడం ఇదే తొలిసారి కావొచ్చు. కానీ కోహ్లీ వారందరిని నిరుత్సాహపరిచాడు. కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు. ఒకప్పుడు ఇదే రంజీల్లో 197 పరుగులు బాదిన ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ రైల్వేస్ బౌలర్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
కోహ్లీ మాత్రమే కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మది అయితే మరీ దారుణం. రోహిత్, శార్దూల్, యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్, రహానె లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్న ముంబై రంజీ టీమ్ జమ్ముకాశ్మీర్ చేతిలో ఓడింది. ఇంతకంటే అవమానం ఏదైనా ఉంటుందా అంటూ ఇప్పటికే మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏకంగా 5 వికెట్ల తేడాతో స్టన్నింగ్ విక్టరీ సాధించింది జమ్ము కశ్మీర్. రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో 28 రన్స్ మాత్రమే చేశాడు.
సునీల్ గవాస్కర్ అయితే టీమిండియా ప్లేయర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం బీసీసీఐ కాంట్రాక్టులు పోకుండా ఉండేందుకు మాత్రమే రంజీ మ్యాచ్‌లు ఆడుతున్నారా? లేక నిజంగానే ఆడాలని ఇంట్రెస్ట్ ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు పైపైన చూస్తే నార్మల్‌గానే ఉన్నా అంతర్లీనంగా చూస్తే ఇవి చాలా దారుణమైన విమర్శలే అని చెప్పాలి. నిజానికి గవాస్కర్ మాత్రమే కాదు టీమిండియా ఫ్యాన్స్ కడుపు రగిలిపోతుంది వారి ఆటను చూస్తుంటే. నిజానికి ప్రతి క్రికెటర్ లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ మరి ఇంత డౌన్‌ఫాల్ మాత్రం ఎక్కడా కనిపించదనే చెప్పాలి. అడపా దడపా మెరవడం తప్ప తమ ఫామ్‌ను ఎవరూ కంటిన్యూ చేయడం లేదు. ప్రతి మ్యాచ్‌లో ఫ్లాప్ షో తప్ప మరేం కనిపించడం లేదు.
వీళ్ల ఆట తీరు చూస్తుంటే టీమిండియా భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్ముకున్నట్టు కనిపిస్తోంది. రోహిత్, కోహ్లీ మరికొన్ని రోజుల్లో రిటైర్ అయిపోతారు. మరి మిగతా వారి సంగతేంటి? అయినా వారిద్దరు కూడా అప్పట్లో మేం ఇరగదీశాం పొడిచేశాం.. అని ఇంకెన్నాళ్లు చెప్పుకుంటూ టీమ్‌కు భారంగా మారుతారు? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల ఫ్లాప్ షో చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ అయినా దక్కేనా? లేకపోతే దుబాయ్ నుంచి కూడా ఉట్టి చేతులతో తిరిగి వస్తారా? అనే సందేహాలు రాక మానదు.
ఇండియాలో ప్రేమ అయినా కోపమైనా పీక్స్‌లోనే ఉంటుంది. ఇప్పుడు వారు ఆడటం లేదు కాబట్టి ఈ విమర్శలు తప్పవు. వీటన్నింటికి వారి ఆటతో గెలుపు సాధించి సమాధానం చెప్పాలి.