మెదక్ జిల్లాలో ప్రమాదవశాత్తూ చిరుత మృతిచెందింది. రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుత.. కాసేపటి తర్వాత అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో జరిగిందీ సంఘటన. జాతీయ రహదారి నెంబర్ 44పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుతపులి వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చిరుత నడుము సహా.. శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. దీంతో, రోడ్డుమీద కదల్లేని స్థితిలో చిరుత పడిపోయింది. వచ్చీ పోయే వాహనాల నుంచి జనం వీడియోలు తీస్తుండటంతో చిరుత భయపడిపోయింది. చాలాసేపటి వరకు జనం చిరుత రోడ్డుపై కదల్లేని స్థితిలో ఉండటం చూసి చలించిపోయారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఈ క్రమంలోనే అదే రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్‌ను చిరుత కొద్దిదూరం వెంబడించింది. అలా వెంబడించి కుప్పకూలి పోయింది. రోడ్డుపైనే చనిపోయింది. ఇప్పుడు చిరుత రోడ్డుపై గాయాలతో బాధపడుతూ దిక్కులు చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.