పార్కిన్సన్స్ వ్యాధి ప్రాణాంతకం కాదు!

0
162

డాక్టర్ పి. రమేష్

న్యూరాలజిస్ట్,

జెమ్ కేర్ పౌలోమి హాస్పిటల్స్,

ఏ ఎస్ రావు నగర్, ఈసీఐఎల్,

హైదరాబాద్.
96765 87770

పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటీ? ఎలా అర్థం చేసుకోవాలి?

ఇది మెదడుకు సంబంధించిన రుగ్మత. కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక రుగ్మత. మెదడులోని నాడీ కణాలు దెబ్బతినడం, బలహీనపడడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి వల్ల శరీర అవయవాల కదలికలో ఇబ్బంది ఏర్పడుతుంది. మెదడు నుంచి వచ్చే సంకేతాల మధ్య సమన్వయం దెబ్బతిని కదలికల్లో తేడాలు వస్తాయి. కదలికను నియంత్రించడంలో సహాయపడే రసాయనం- డోపమైన్ను ఉత్పత్తి చేసే మెదడు కణాలు- దెబ్బతిన్నప్పుడు లేదా పూర్తిగా క్షీణించినపుడు (డెడ్) ఇలా జరుగుతుంది. ఇది క్రమంగా పెరిగి మనిషి కదలికలను దెబ్బతీస్తుంది. కాలక్రమేణా తీవ్రమవుతుంది. వయసుతో పాటే పార్కిన్సన్స్ వ్యాధి కూడా పెరుగుతుంది. అది ప్రారంభమయ్యే సగటు వయస్సు 60 ఏళ్లు. పార్కిన్సన్స్ వ్యాధి స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. 5 నుంచి 10 శాతం రోగులకు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది.
సాధారణ లక్షణాలు:
1. వణుకుడు (ట్రేమర్స్)- కాళ్లు, చేతుల్లో వణుకు. విశ్రాంతి సమయంలో ఈ వణుకు ఉంటుంది.
2. బిగుతు – కండరాలు బిగుతుగా అనిపిస్తాయి, కదలికను కష్టతరం చేస్తుంది.
3. కదలిక మందగించడం(స్లోడ్ మూవ్మెంట్ )- నడక వంటి రోజువారీ పనులు కూడా నెమ్మదిస్తాయి.
4. సమతూకం దెబ్బతింటుంది – ఒక్కోసారి నిలబడడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అస్థిరత ఎక్కువగా ఉంటుంది.
5. మాటలో మార్పు -మాట అస్పష్టంగా ఉంటుంది. ముద్దముద్దగా మాట్లాడాల్సి రావచ్చు.
ఇతర లక్షణాలు- నిద్రకు ఇబ్బంది, మలబద్ధకం, విసుగు, మానసిక కుంగుబాటు, నిరాశ, వాసన కోల్పోవడం వంటివి కూడా ఉంటాయి.

పార్కిన్సన్స్ వ్యాధి రకాలు:
1. ఇడియోపతిక్ పార్కిన్సన్స్ వ్యాధి – చాలా సాదాసీదా రకం. ఎటువంటి నిర్దిష్ట కారణం లేకుండానే వస్తుంది. వణుకు, పట్టు కోల్పోవడం, కదలిక మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి.
2. జెనిటికల్ పార్కిన్సన్స్ వ్యాధి – వంశ పారంపర్యంగా, వారసత్వంగా వచ్చే జన్యుపరంపర వల్ల కూడా రావచ్చు. అయితే ఇది చాలా అరుదు. కొన్ని కుటుంబాలకే పరిమితం.
3. సెకండరీ పార్కిన్సోనిజం – కొన్ని రకాల ఔషధాలు, మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా వంటి జీవులు ఉత్పత్తి చేసే విషపూరిత టాక్సిన్లు, తలకు గాయాలు, తలకు ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల కూడా పార్కిన్సన్స్ వ్యాధి రావచ్చు.
4. ఎటిపికల్ పార్కిన్సోనిజం – ఏ కోవకీ చెందని ప్రత్యేక కారణాల వల్ల కూడా పార్కిన్సన్స్ వ్యాధి రావచ్చు. మల్టిపుల్ సిస్టమ్ అట్రోఫీ (MSA) లేదా ప్రోగ్రెసివ్ సూపర్న్యూక్లియర్ పాల్సీ (PSP) వంటి పరిస్థితుల వల్ల రావచ్చు. అయితే ఇవన్నీ చాలా అరుదైనవి. ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి.

కారణాలు, రోగనిర్ధారణ!
పలానా కారణం వల్ల ఈ వ్యాధి వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ప్రమాద కారకాలలో వయస్సు, జన్యుశాస్త్రం, కొన్ని రసాయనాలకు గురికావడం వంటివి ఉన్నాయి. పేషెంట్ వైద్య చరిత్ర, లక్షణాలు, శారీరక పరీక్షలు నిర్వహించడం ద్వారా వైద్యులు పార్కిన్సన్స్ని నిర్ధారిస్తారు.
పార్కిన్సన్స్ వ్యాధి ఒక సంక్లిష్టమైన నరాల బలహీనతకు సంబంధించింది (న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్). దాన్ని పూర్తిగా నిరోధించే మార్గం లేనప్పటికీ, ప్రమాదాన్ని తగ్గించడంలో లేదా ఈ వ్యాధి రాకుండా కొంతకాలం ఆపడానికి ఉపయోగపడే అనేక పద్ధతులు మాత్రం ఉన్నాయి.

వాటిలో కొన్ని:
1. వ్యాయామం, శారీరక శ్రమ
2. మితంగా కెఫిన్ వినియోగం
3. తలకు గాయాలు కాకుండా చూసుకోవడం
4. పురుగు మందులు, హెవీ మెటల్స్ వంటి విషపదార్ధాలకు దూరంగా ఉండండి

పార్కిన్సన్స్ తో జీవించాల్సి వస్తే…
పార్కిన్సన్స్ వ్యాధి అనేది చాలా మామూలు వ్యవహారమే. వయసు పైబడిన వారికి వచ్చే అవకాశం ఉంది. వివిధ రకాల మందులతో, మెదడుకి శస్త్ర చికిత్స-డీప్ బ్రెయిన్ స్టిములేషన్- (DBS)తో తీవ్రతను తగ్గించవచ్చు. ఇదేమీ ప్రాణాంతక వ్యాధి కాదు. డాక్టర్లు సూచించినట్టు మందులు వాడాలి. వాడే మందుల వల్ల ఏవైనా దుష్ప్రభావాల లక్షణాలు కనిపిస్తే న్యూరాలజిస్ట్ను సంప్రదించాలి. రోగులు జీవనశైలి మార్చుకోవాలి. ధ్యానం, యోగా, శారీరక శ్రమ, వ్యాయామం వంటి వాటిని అనుసరించాలని డాక్టర్ రమేష్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here