30.6 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

ఏపీకి కేంద్రబడ్జెట్‌లో ప్రాధాన్యం ఉండేలా చూడాలి – ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

– కొత్త రహదారుల కేటాయింపు, రహదారుల విస్తరణకు అనుమతులు వచ్చేలా చేయాలి
– రాష్ట్ర పరిస్థితిని వివరించి రాష్ట్రాభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలి
– పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అవసరమైనన్ని నిధులు కేటాయించేలా చూడాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రూ.11,440 కోట్లు, నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టు కోసం రూ.14,000 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు, కొప్పర్తి, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ కారిడార్లకు రూ.4,936 కోట్లు కేటాయించేందుకు కేంద్రం ముందుకొచ్చిందని తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూడాలని ఎంపీలకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీరం మన రాష్ట్రానికే ఉందని, పోర్టుల నిర్మాణం ద్వారా దాన్ని సద్వినియోగం చేసుకుంటే పెద్దఎత్తున ఉపాధి లభించటంతోపాటు సంపద సృష్టి జరుగుతుందని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కొత్త రహదారులు రాష్ట్రానికి కేటాయించేలా, రహదారుల విస్తరణకు అనుమతులు వచ్చేలా ఎంపీలు పనిచేయాలని, విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేలా చూడాలని ఎంపీలకు సూచించారు.

నూతన పాలసీలపై అవగాహన పెంచుకోవాలి :

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలపై, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం, విదేశాల్లో అమలవుతున్న ప్రాజెక్టులు, పాలసీలపై ఎంపీలు అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అధ్యయనం చేసి రాష్ట్రంలోని సంబంధిత మంత్రులకు ఎంపీలు తెలియజేయాలన్నారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు గేమ్ ఛేంజర్‌లా పనిచేస్తుందని, అది పూర్తయితే రాష్ట్ర రైతాంగానికి పెద్దఎత్తున ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో కరవు నివారణ చేయవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12 వేల కోట్లు ఇచ్చిందని.. ప్రాజెక్టు శరవేగంగా పూర్తిచేసి దాని ఫలాలు రైతులకు అందించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

నూతన ప్రాజెక్టుల సాధనకు కృషి చేయండి :

రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతోపాటు నూతన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్, రేణిగుంట-గూడూరు, కోటిపల్లి-నర్సాపూర్, కడప-బెంగళూరు తదితర ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేలా బడ్జెట్‌లో అవసరమైనన్ని నిధులు కేటాయించేలా చూడాలని ఎంపీలకు చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమన్వయం చేసుకొని విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేయాలన్నారు. ఎమ్మెల్యేలతో, నియోజకవర్గ నేతలతో సమన్వయం చేసుకోవాలని, కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఉపాధిహామీ వంటి పథకాలకు అనుమతులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించి కేటాయించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.

అయితే, కేంద్రమంత్రులు, ఎంపీలు పలు అంశాలను ఈ సమావేశంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేటప్పుడు జీఎస్టీ లేకుండా చూడాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తావించగా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వక్ఫ్ అమెండ్‌మెంట్ బిల్లు 2024 జాయింట్ పార్లమెంట్ కమిటీకి వెళ్లడానికి టీడీపీ ఎంపీల కృషే కారణమని, బిల్లుకు 14 సవరణలు ఆమోదించగా ఇందులో 4 టీడీపీ ప్రతిపాదించినవే అని టీడీపీ పార్లమెంటరీ నేత కృష్ణదేవరాయలు చెప్పారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీల హాజరు దేశ వ్యాప్తంగా ఉన్న సగటు కంటే ఏపీ టీడీపీ ఎంపీల హాజరు అధికంగా ఉందని, అదే విధంగా సభ్యులు ప్రశ్నలు అడగటంలో జాతీయ సగటు 9 శాతం ఉంటే.. ఏపీది 20 శాతం ఉందని, అందులో టీడీపీ సభ్యులది 23 శాతం అధికంగా ఉందని సీఎం అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై పార్లమెంటులో లేవెనెత్తి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలతో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com