34.2 C
Hyderabad
Sunday, April 19, 2026

Live Video

spot_img

2025 బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది?

  • కొత్త టాక్సుల విధానం అమల్లోకి
  • ఇన్‌ కం టాక్స్ శ్లాబుల్లో మార్పులు
  • డిడక్షన్లలో, మినహాయింపుల్లో పెరుగుదల?
  • వృద్ధతరం కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో మార్పులు
  • ఈవీల కొనుగోలు ప్రోత్సాహకాలు మరింత ముమ్మరం?

ఈసారి ఆర్థిక మంత్రి బడ్జెట్ ఎలా ఉంటుందా అన్న ఉత్కంఠ అందరిలో ఉంది.టాక్స్ పేయర్లు,నిపుణులు ఈసారి బడ్జెట్ లో ప్రధానమైన మార్పులు ఉండొచ్చని ఊహిస్తున్నారు. ఇన్ కమ్ టాక్సు శ్లాబులలో మార్పులు ఉండవచ్చని, నూతన టాక్సు విధానం అమల్లోకి వస్తుందని పరిమితులు, మినహాయింపులలో భారీ పెరుగుదల ఉండొచ్చని ఆశిస్తున్నారు.కొత్త టాక్సు విధానంలో జాతీయ పెన్షన్ స్కీముకు స్వచ్ఛందంగా నిధులు కేటాయింపు , డిడక్షన్ల విధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.హెల్త్, ఇన్సూరెన్సు ప్రీమియంలలో డిడక్షన్ల పరిమితిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాత, కొత్త ఇన్‌ కంటాక్సు విధానాలు రెంటిలోనూ వేతన జీవులు, మధ్యతరగతి వారు ఆదాయ పన్ను పరిమితిలో భారీ ఊరటను కోరుకుంటున్నారు. ఇప్పటి వరకూ అది మూడు లక్షలుగానే ఉంది.. ఆపై ఆదాయం ఉన్నవారు కచ్చితంగా పన్ను కట్టాల్సిందే. ఈసారి బడ్జెట్‌ లోనైనా ఊరడింపుల కోసం మధ్యతరగతి ఆత్రంగా ఎదురు చూస్తోంది. కనీస ఆదాయ పన్ను పరిమితిని పది లక్షలకు చేయాలని మధ్య తరగతి కోరుకుంటోంది. అలాగే హెల్త్, ఇన్సురెన్సు ప్రీమియంలకు సంబంధించి భారీ మినహాయింపులు కల్పించాలని కోరుకుంటున్నారు.అలాగే స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలకు భారీ మినహాయింపులు ఇవ్వాలని వేతన జీవులు ఆశిస్తున్నారు. మధ్యతరగతి, వేతన జీవుల ఆలోచనలు ఇలా ఉండగా ఈనెల31న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశ పెడతారు.ఫిబవరి 1న అంటే శనివారం బడ్జెట్‌ ప్రవేశ పెడతారు.

టాక్స్ పేయర్లు కోరుకుంటున్నది ఇదే

ఈసారైనా బడ్జెట్ లో ఇన్ కం టాక్సు శ్లాబ్ రేట్స్ సవరించాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50 వేలుగా ఉంది.కొత్త విధానంలో ఆ పరిమితిని2024 బడ్జెట్‌ లో రూ.75 వేలకు పెంచారు. అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ( లాంగ్‌ టర్మ్ క్యాపిటల్‌ గెయిన్స్ టాక్స్), స్వల్ప కాలిక మూలధన లాభాల పన్ను( షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్)లలో కూడా ఊరడింపులు ఉంటాయని అందరూ అనుకున్నా 2024 మధ్యంతర బడ్జెట్ లో దీనికి సంబంధించిన నిబంధనలను ముందే ప్రవేశ పెట్టారు కాబట్టి ఈసారి వీటిలో ఎలాంటి ఊరడింపులు దక్కే అవకాశం లేదు.
గతేడాది బడ్జెట్‌ లో ఇన్‌ కం టాక్సు విధానాలపై సమగ్రంగా సమీక్షించారు. మన దేశంలో ఇప్పటికీ 63 ఏళ్ల నాటి ఇన్‌ కం టాక్సు విధానమే అమల్లో ఉంది. అయితే ఐటీ యాక్టును టాక్స్ పేయర్లకు వెసులు బాటు కల్పించే విధంగా సులభమైన విధానాన్ని అమల్లోకి తెచ్చే అంశంపై కూడా చర్చ జరిగింది. ఇన్ కం టాక్సు కు సంబంధించిన లిటిగేషన్ ప్రోసెస్ లను సులభతరం చేయడానికి ఈసారి డైరక్ట్ టాక్స్ కోడ్‌ ను అమల్లోకి తెచ్చే వీలుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జె్ట్ లోనే హింట్ ఇచ్చారు. పట్టణాల్లో ప్రజల రోజు వారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుండటంతో సేవింగ్స్ అన్నవి ఉండటం లేదు. దాంతో ఈసారి వినిమయం తగ్గించి ప్రజల జేబుల్లో డబ్బు మిగిలేలా బడ్జెట్‌ను రచించే పనిలో పడింది ప్రభుత్వం.

సీనియర్ సిటిజన్లకు ఈ బడ్జెట్లో ఏముండొచ్చు?

2025 బడ్జెట్ లో రిటైర్మెంట్ ప్లానింగ్‌ చేసుకునేవారికి సరికొత్త పెట్టుబడి సాధనంగా నేషనల్‌ పెన్షన్ స్కీము ను కేంద్రం అందించబోతోంది.పాత పన్నుల విధానంప్రకారం టాక్స్ పేయర్లు జీతంలో పది శాతాన్ని సెక్షన్ 80CCD కింద నేషనల్‌ పెన్షన్ స్కీముకు కనీసంగా చెల్లించవచ్చు.అయితే సెక్షన్ 80CCE కింద రూ.1.50 లక్షల వరకు మాత్రమే జమ చేసేలా పరిమితి ఉంది. అయితే ఉద్యోగులు కోరుకుంటే 50వేలకు పైగా, లేదా లక్షన్నరలోపు కూడా తమ జీతం నుంచి నేషనల్ పెన్షన్ స్కీముకు అలాట్‌ చేసుకోవచ్చు.ఈ వెసులుబాటు కొత్త పన్నుల విధానంలోగానీ,పదవీ విరమణ అనంతరం అందించే ఇతర ప్రయోనాల లిస్టులో కానీ లేదు.

వృద్ధతరం సంక్షేమం కోసం..

ఈసారి బడ్జెట్ లో ఆదాయపన్నుకోతలు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. తద్వారా వేతన జీవులు లైఫ్‌ ఇన్సూరెన్సు స్కీముల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు దారి తీయవచ్చు.రానున్న ఆరేళ్లలో 50 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య 22 శాతం పెరగనుంది.కాబట్టి వారికి పెన్షన్ తరహా ప్రోత్సాహకాలు ఎక్కువగా అందించాల్సిన అవసరముంది.

సెక్షన్ 87 A ప్రకారం టాక్సు రిబేట్‌ లో రేటు పెంపు ఉంటుందా?

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం టాక్స్ పేయర్లు టాక్సు రిబేట్‌ ను క్లెయిమ్‌ చేసుకోవచ్చు.. టాక్సు రిబేట్‌ పొందాలంటే పాత విధానం ప్రకారం వార్షికాదాయం రూ. ఐదు లక్షలకు లోబడి ఉండాలి. అలాగే కొత్త విధానం ప్రకారం వార్షికాదాయం రూ. 7 లక్షలకు లోబడి ఉండాలి. అయితే కొత్త విధానంలో ఈ రిబేటును మరింత పెంచవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పాత ఐటీ యాక్ట్ కు బదులు అంచెలంచెలుగా కొత్త టాక్సు విధానాలను అమల్లోకి తెస్తుందని దీనివల్ల టాక్సు పేయర్లు మరింత పొదుపు చేసుకోవచ్చనీ, పెట్టుబడులు పెట్టొచ్చని, దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెచ్ ఆర్ ఏ అలవెన్స్ ఇకపై ఉండదా?

పాత ఐటీ యాక్టు ప్రకారం ఉద్యోగస్తుల జీతంలో HRA అలవెన్సు మెట్రో నగరాలకైతే వారి బేసిక్ శాలరీ, ప్లస్ డియర్ నెస్ అలవెన్స్ లో 50 శాతంగా , నాన్ మెట్రో సిటీలకైతే 40శాతంగా లేదా బేసిక్ శాలరీ, డియర్ నెస్ అలవెన్సులో 10 శాతంగా నిర్ధారించారు.2025-2026 బడ్జెట్ లో కొత్త ఐటీ యాక్టును అమల్లోకి తెచ్చే అవకాశాలున్నాయి. కొత్త యాక్టు ప్రకారం HRA బెనిఫిట్స్ స్థానంలో కీలకమైన మార్పులు తేనున్నారు. దీనివల్ల HRA క్లెయిమ్ చేసుకునే వీలుండదు. కానీ HRA తొలగిస్తే అర్బన్ ఉద్యోగస్తులు భారీగా నష్టపోతారు కాబట్టి ఉద్యోగస్తులు పాతవిధానాన్నే కోరుకునే అవకాశాలున్నాయి.

ధరలకు కళ్లెం వేస్తారా?

గత బడ్జెట్‌ లో నిత్యావసరాలపై కూడా జీఎస్టీ మోత మోగించిన నిర్మలా సీతారామన్ ఈసారి కూడా అదే కొనసాగించే అవకాశాలే ఎక్కువ. మధ్యతరగతికి ధరల పెరుగుదల చాలా సమస్యగా మారింది. అడ్డూ అదుపు లేకుండాపెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసే చర్యలేమైనా తీసుకుంటారా అని మధ్యతరగతివారు,అల్పాదాయ వర్గాల వారు ఆశతో ఎదురు చూస్తున్నారు. దీనికి మూల కారణం పెట్రోల్‌ ధరల పెంపు.. మోడీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్‌ రేట్లు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ధరల పెరుగుదలకు మూలకారణం అంతర్జాతీయ ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగడమేనంటున్న ప్రభుత్వం పెట్రో ధరలను స్థిరీకరించడానికి ఎలాంటి ప్రణాళికలు మాత్రం వేయలేకపోతోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, దేశాల మధ్య యుద్ధాలు లాంటి కారణాలు కూడా పరోక్షంగా ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతున్నాయి.

80 సి ప్రకారం టాక్స్ డిడక్షన్ పరిమితిని పెంచాలి..

సెక్షన్ 80 C ప్రకారం టాక్సు డిడక్షన్లను2014-2015 మధ్య కాలంలో మాత్రమే సవరించారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ అందులో ఎలాంటి మార్పు లేదు.అప్పట్లో దీని పరిమితిని లక్ష రూపాయలనుంచి 1.5 లక్షలకు పెంచారు. అయితే ఇప్పుడు సెక్షన్ 80C ప్రకారం ఇన్వెస్ట్ మెంట్ పరిమితి పెంపు,హెల్త్, లైఫ్‌ ఇన్సురెన్సు ప్రీమియం లలో డిడక్షన్ల పెంపు వల్ల సేవింగ్స్ పెరగడమే కాక ఆర్థికపరమైన భరోసా ఉంటుంది.అందుకే ఉద్యోగస్తులు హెచ్‌ ఆర్‌ఏ మినహాయింపులను, డిడక్షన్ పరిమితిని పెంచాలని కోరుకుంటున్నారు.

ఈవీల పై పన్ను ప్రోత్సాహకాల కాలపరిమితి పెంచుతారా?

మన దేశంలో కాలుష్య నివారణకు ఈవీ ల వాడకం ఒక పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అదీకాక 2030 నాటికల్లా ఈవీల వాడకం 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం టార్గెట్‌ గా పెట్టుకుంది. ఈవీల వాడకాన్ని ఒక ఉద్యమంలా చేపట్ట దలచిన ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు ఇచ్చే రుణాలకు లక్షన్నర వడ్డీ మాఫీ ని కూడా ప్రకటించింది. ఐటీ యాక్టులోని సెక్షన్ 80EEB ఈ మినహాయింపులు కల్పిస్తోంది. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. 2019 జనవరి నుంచి 2023 మార్చి మధ్యకాలంలో అప్రూవ్ అయిన లోన్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత కొన్న వాటికి మాత్రం ఇది వర్తించదు. కానీ 2030 నాటికల్లా ఈవీల వాడకం ఒక ప్రభంజనంలా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌ లో ఆ కాలపరిమితిని 2030 వరకూ పెంచే అవకాశాలున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com