- ఎక్స్ లో షేర్ చేసిన నాసా ఆస్ట్రోనాట్ డాన్ పెటిట్
- విద్యుద్దీప కాంతులతో శోభిల్తుతున్న ప్రయాగ్ రాజ్
- విద్యుద్దీకరణకే రూ.400 కోట్లు ఖర్చు చేసిన యోగీ ప్రభుత్వం
ప్రయాగ్ రాజ్ లో వైభవోపేతంగా సాగుతున్న మహాకుంభమేళా సుందర దృశ్యాలు అంతరిక్షంలోని అస్ట్రోనాట్లను సైతం అబ్బుర పరుస్తున్నాయి. రాత్రి వేళ అంతరిక్షం నుంచి కుంభమేళా హడావుడి అత్యద్భుతంగా కనిపిస్తోందంటూ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న నాసా ఆస్ట్రోనాట్ డోనాల్డ్ పెటిట్ తన ఎక్స్ ఖాతాలో రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఆకాశం నుంచి చూస్తే భూమిపై సువిశాల త్రివేణి సంగమం కళకళలాడుతూ నిరంతర విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా కనిపిస్తోందని డాన్ పెటిట్ కామెంట్ చేశారు. ప్రపంచంలోకే అతిపెద్ద మానవ సామూహిక ఉత్సవం నవనవోన్మేషంగా సాగుతోందంటూ డాన్ పెటిట్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆస్ఱ్రో ఫోటోగ్రఫీలో నిష్ణాతుడైన పెటిట్ స్పేస్ స్టేషన్ నుంచి ఈ సుందర దృశ్యం చూసి తనువు పులకిస్తోందన్నారు.
హై రిజల్యూషన్ కెమెరాలు
అంతరిక్షంలో గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఐఎస్ ఎస్ నౌకలో ఉన్న డోనాల్డ్ పెటిట్ హై పవర్డ్ కెమెరాల సాయంతో ఈ ఫోటోలను తీశారు. డాన్ పెటిట్ ఫోటోలపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు.
ప్రశంసల జల్లు…
ఇంతపెద్ద ఉత్సవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా సాగడం అంటే హిందూ మత విశ్వాసాలకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రబల నిదర్శనమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఔరా.. అచంచలమైన భక్తికి ఆధ్యాత్మిక శక్తికి ఈ మహాకుంభమేళా ఒక నిదర్శనం అని మరో నెటిజన్ అన్నారు. ఎలీనా అనే మరో నెటిజన్ ఈ పోటోలు చూస్తుంటే తాను అంతరిక్షంలో ఓ నక్షత్రాన్ని అయినంత అనుభూతి కలుగుతోందని, సరికొత్త విశ్వాన్ని ఆవిష్కరిస్తున్న అనుభూతి కలిగిస్తోందని కామెంట్ చేసింది.
విద్యుద్దీకరణకే రూ.400 కోట్లు
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో కేవలం విద్యుద్దీప కాంతులకే యూపీ ప్రభుత్వం రూ.400కోట్లు ఖర్చు చేసింది. 45 రోజుల పాటు సాగుతున్న ఈ ఉత్సవం కోసం 182 కిలోమీటర్ల మేర హై టెన్షన్ లైన్లను ఏర్పాటు చేశారు. 40,000ల రీచార్జిబుల్ బల్బులను ఏర్పాటు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే 2,700 సీసీటీవీలను వినియోగించారు. త్రివేణి సంగమంలో అండర్ వాటర్ డ్రోన్ లను కూడా అందుబాటులో ఉంచారు.
డోనాల్డ్ పెటిట్ ఈ భూలోక మహాద్భుతాన్ని చిత్రీకరించేటప్పుడు సహ ఆస్ట్రోనాట్ భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ కూడా పక్కనే ఉన్నారు. వీరు గతంలోనే భూమికి తిరిగి రావాల్సి ఉన్నా స్పేస్ రాకెట్ లో లోపం వల్ల అక్కడే ఉండిపోయారు. దాదాపు పదినెలలుగా వారు అక్కడే ఉన్నారు. స్పేస్ ఎక్స్ క్రూ 10 లాంచ్ లో ఆలస్యం వల్ల మార్చి తర్వాత మాత్రమే వారు భూమికి చేరే అవకాశముంది.