సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఒక యువకుడి హత్య కలకలం రేపుతోంది. ప్రేమ వివాహమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. సూర్యాపేట శివారులోని మామిల్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి హత్యకు గురయ్యాడు. పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాలువగట్టుపై కృష్ణ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఈ హత్యకు ప్రేమ వివాహమే కారణమని అనుమానిస్తున్నారు. గత ఆరు నెలల క్రితం పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల భార్గవి అనే యువతిని కృష్ణ ప్రేమ వివాహం చేసుకుని సూర్యాపేటలో కాపురం పెట్టాడు. అయితే కూతురు ప్రేమ పెళ్ళిని నిరాకరించిన భార్గవి వీరిద్దరినీ విడదీసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కుదరకపోవడంతో కృష్ణపై కక్ష్య పెంచుకున్నారు. ఈ కక్షతోనే భార్గవి సోదరుడు ఈ హ్యతకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మహేష్ అనే మిత్రుడు ఫోన్ చేయడంతో భార్యకు చెప్పి బయటకు వెళ్ళిన కృష్ణ ఎంత రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. కృష్ణ ఆచూకీ కోసం ఆందోళణ చెందుతున్న కుటుంబసభ్యులకు కృష్ణ హత్యకు గురయ్యాడన్న వార్త తెలిసి కుప్పకూలిపోయారు. కృష్ణను హత్య చేసి పిల్లలమర్రిలోని భార్గవి ఇంటి సమీపంలోనే మృతదేహాన్ని పడేశారు. మృతుడి మెడకు ఉరి బింగించినట్లు మెడమీద గుర్తులు కనుగొన్నారు పోలీసులు. దీనితో పాటు శరీరంపై కమిలిన దెబ్బలను కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.