34.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

కాంగ్రెస్‌ సంక్షేమ ప్రవాహంలో బీఆర్‌ఎస్‌ కనుమరుగు – డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి నిరంతరం అమలవుతోన్న, కొత్తగా ప్రారంభమవుతోన్న సంక్షేమ పథకాల ప్రవాహంలో బీఆర్‌ఎస్‌ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కొట్టుకుపోతున్నారని, క్రమంగా ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం చిన్న గోపతి గ్రామంలో ప్రజా పాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు అనుమతి పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు ప్రారంభోత్సవం మాత్రమే జరిగిందని, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, వాళ్ల పార్టీ సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. నువ్వు నీ పరివారం భ్రమల్లోనే బతకండి అని భట్టి విక్రమార్క మల్లు విరుచుకుపడ్డారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన ఈరోజు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక గ్రామంలో నూరు శాతం అందిస్తూ లాంఛనంగా పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. నాలుగు సంక్షేమ పథకాలు వినబడడానికి చిన్నగా ఉండొచ్చు కానీ.. ఈ పథకాల అమలుకు ఏడాదికి 45 వేల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. అయినా ప్రజలందరికీ మంచి చేయాలని పథకాల పంపిణీ మొదలుపెట్టామన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందన్నారు. నిధులు అందుబాటులో ఉన్న గత పది ఏళ్లపాటు మాలాగా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని భట్టి ప్రశ్నించారు. గత పాలకులు పది సంవత్సరాలు ప్రజల గురించి ఆలోచన చేస్తే తాము ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు ఇవ్వాల్సి వచ్చేది కాదన్నారు.


భారత రాజ్యాంగం ఈ దేశ జీవన విధానం.. ప్రపంచంలో భారత్ దేశం బలంగా నిలబడడానికి రాజ్యాంగమే పునాదులు వేసిందని అన్నారు. హక్కులు, విధులు, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, భావ స్వేచ్ఛకు సంపూర్ణ సహకారం రాజ్యాంగం ద్వారా మనకు లభించాయని తెలిపారు. అయితే, రాజ్యాంగానికి భిన్నంగా నడుచుకోవాలని కొందరు చూస్తున్నారని, సొంత భావజాలాన్ని ప్రజలపై రుద్దాలని కొందరు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తాం అంటూ కేసిఆర్ మాట్లాడితే తగుదునమ్మా అంటూ ఆయన కొడుకు.. దశాబ్ద కాలంగా అల్లాడిన పేద ప్రజలను పట్టించుకోకుండా.. ఒకే గ్రామంలోనే ఇస్తారా అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి పథకాన్ని సంతృప్త స్థాయిలో అమలు చేస్తామన్నారు.

గత పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలకుల కోసమే వాడుకున్నారు తప్పితే.. ప్రజలను పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం సంపద సృష్టిస్తాం, పేద ప్రజలకు పంచుతాం అంటున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. గత పాలకులు నాలుగు గోడల మధ్య .. గడిల్లో కూర్చొని లబ్ధిదారులను ఖరారు చేశారని ఆరోపించారు. తాము మూడు రోజులు ప్రజల మధ్య గ్రామసభలు పెట్టి
జాబితాలు ప్రకటించి… ఇంకా మిగిలిన వారు ఉంటే దరఖాస్తులు పెట్టుకోమని పిలుపునిచ్చామన్నారు. ఇళ్లు, రేషన్ కార్డులు రాకుండా సమాజానికి ద్రోహం చేసేవాళ్లు గ్రామసభలో గొడవలు చేయాలని ప్రయత్నం చేశారన్నారు. గ్రామ సభల్లో అధికారులు ప్రకటించే పేర్లే చివరి జాబితా అని ప్రజలను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ నాయకులు చూశారని, వారి మాదిరిగానే కొద్దిమందికే పథకాలు ఇచ్చి చేతులు దులుపుకుంటామని అనుకున్నారని ఎద్దేవా చేశారు. కానీ ప్రజలు తమ ప్రభుత్వం పిలుపును అర్థం చేసుకొని గ్రామసభల్లో లక్షల కొద్దీ దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. అయితే, లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని, అన్నింటికీ ఒకేసారి ఇవ్వలేమని, 26వ తేదీన మొదలు పెడతామని చెప్పామని, అందుకే ప్రతి గ్రామంలో లాంఛనంగా ఈరోజు నాలుగు పథకాలు ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వంలో మూడు నెలల వ్యవధిలోనే 22 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాల్లో కనీసం లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు.. కేవలం పాలకులకు మాత్రమే మేలు చేయాలనుకున్నారని, వాళ్లేమో దోపిడీ చేశారని.. కానీ, తాము మాత్రం సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

సీఎల్పీ నేతగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన వ్యక్తిగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రతి నిమిషం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితమని.. నిత్యం ప్రజలకు పనికి వచ్చే నిర్ణయాలే తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నిటికీ షరతులు లేకుండా బరాబర్ లెక్క కట్టి సోమవారం ఉదయానికల్లా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాలుగా హాస్టల్ పిల్లలు తింటున్నారో లేదో బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే సర్వే చేసి డైట్ చార్జీలు 40% కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచామని తెలిపారు. ప్రపంచంతో పోటీపడేలా ఒక్కో పాఠశాల 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ లకు త్వరలో టెండర్లు పిలవబోతున్నామన్నారు. ఏడాది కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 56వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఐదు సంవత్సరాల్లో కోటి మంది డ్వాక్రా మహిళలను వడ్డీ లేని రుణాల ద్వారా కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి స్వయం సహాయక సంఘాలు, విద్యుత్ శాఖ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com