కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అస్తిత్వానికి, ఆత్మగౌరానికి ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, సమాజం కోసం, కలల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఐదుగురు పేర్లను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. ఒక్కరికి కూడా అవార్డు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజాయుద్ధ నౌక గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయదీర్ తిరుమల రావు ..వీరిలో ఒక్కరికి కూడా అర్హత లేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినందుకే రాజకీయ దురుద్దేశంతోనే వీరి పేర్లను కేంద్రం ప్రకటించలేదని ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తి కి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఐదుగురిలో ఒక్కరికి కూడా అవార్డులు ఇవ్వకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన వారికి ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం సూచించిన వారికి ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వపక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. అయితే మంద కృష్ణ మాదిగ కు పద్మశ్రీ ఇవ్వడం అభినందనీయం అని మల్లు భ్టటి విక్రమార్క తెలిపారు.