28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

రాజ్యాంగం… 75 ఏళ్ల ప్రయాణం

రాజ్యాంగం రాయడానికి తీవ్ర కసరత్తు

2 ఏళ్ల, 11 నెలల, 18 రోజులు

రేపు పార్లమెంటు పాత భవనంలో వేడుకలు

బ్రిటీష్ తెల్లదొరల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న తర్వాత మన దేశం అడుగులు ఎలా ఉండాలి అని నిర్దేశించుకోవడానికి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. అలా రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోద ముద్ర వేసి నవంబర్ 26 నాటికి 75 ఏళ్లు పూర్తవుతాయి. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువల్ని పాటిస్తూ ముందుకు వెళ్లడానికి, మన ప్రయాణాన్న సరైన దిశగా వెళుతోందా లేదాని నిర్ధారించుకోవడానికి 2015 నుంచి ఈ రాజ్యాంగదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రచించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మన నాయకులు అప్పట్లో చేసిన కృషి గురించి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1946 డిసెంబర్ 6న రాజ్యాంగ సభని ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి రాజ్యాంగ రచన పూర్తి కావడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం తొలి ముసాయిదాను రాజ్యాంగ సభకు సలహాదారుగా ఉన్న సర్ బెనగళ్ నర్సింగరావు రచించారు. ఇందు కోసం బీఎన్ రావు అమెరికా, కెనడా, ఐర్లండ్, బ్రిటన్ దేశాల్లో పర్యటించి అక్కడి రాజ్యాంగాలను పరిశీలించి మన రాజ్యాంగ ముసాయిదా తొలి ప్రతిని రచించారు. ఈ తొలి ప్రతిని అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన 1947 ఆగస్టు 29న  ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ప్రధాన సభ్యుడిగా న్యాయవాది అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఉన్నారు. ఆయనతో పాటు ఎన్ గోపాలస్వామి, కేఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బీఎల్ మిట్టర్, డీపీ ఖైతాన్ లు తొలుత సభ్యులుగా ఉన్నారు. బీఎల్ మిట్టర్ కి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన స్థానంలో మైసూర్ దీవాన్ గా పని చేసిన సివిల్ సర్వీసు అధికారి న్యాయపతి మాధవరావుని కమిటీ సభ్యుడిగా  చేర్చుకున్నారు. డీపీ ఖైతాన్ మరణించడంతో ఆయన స్థానంలో టీటీ కృష్ణమాచారి సభ్యుడయ్యారు.

వీళ్లు ఒక్కొక్కరు రాజ్యాంగంలో ఒక్కో అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపి, తమ అనుభవాన్నంతా రంగరించి రాజ్యాంగంలో పొందుపరిచారు. మొత్తం 166 సార్లు రాజ్యంగ సభ సమావేశమైతే 114 సార్లు రాజ్యాంగం ముసాయిదాపైనే చర్చలు జరిగాయి. రాజ్యాంగంలోని పౌర హక్కుల, బాధ్యతలు, దేశ రక్షణ వంటి అంశాలకు సంబంధించిన ఆర్టికల్స్ రచన అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ పర్యవేక్షణలో సాగింది. జమ్మూ కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే అత్యంత వివాదాస్పద ఆర్టికల్ 370 రచనని ఎన్. గోపాలస్వామి అయ్యంగార్ రాశారు. ఈ ఆర్టికల్ ఎందుకు ఉండాలో ఆయన అప్పట్లో రాజ్యాంగ సభలో కూడా బలమైన వాదనలు వినిపించారు. రాజ్యాంగ రచనలో పాల్గొన్న ఒకే ఒక్క ముస్లిం లీగ్ సభ్యుడైన మహ్మద్ సాదుల్లా మైనార్టీ హక్కుల్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. బీఎల్ మిట్టర్ సంస్థానాల విలీనానికి సంబంధించిన విధివిధానాలపై పని చేశారు. ఎన్. మాధవరావు రాజ్యాంగానికి అత్యంత కీలకమైన సమాఖ్య విధానంపై దృష్టి సారించారు. కృష్ణమాచారి భావప్రకటనా స్వేచ్ఛ, ప్రభుత్వ ఆర్థిక సంస్థల ఏర్పాటు వంటి అంశాల గురించి రాశారు.  ఇలా ఇంత మంది నిపుణులు కష్టపడి రాజ్యాంగానికి ఒక రూపం తీసుకు వచ్చాక మళ్లీ మూడు సార్లు దానిని పఠనం చేసి మార్పులు చేర్పులు చేశారు.

చేత్తో రాసిన రైజాదా

మన రాజ్యాంగం ముసాయిదా ప్రతిని చేత్తో రాశారు. ఆయన పేరు ప్రేమ్ బిహారి నారాయణ్ రైజదా. కాలిగ్రాఫర్ గా ఆయన ఎంతో ఖ్యాతి గడించారు. మన దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూయే రాజ్యాంగాన్ని చేత్తో రాసే బాధ్యత ఆయనకు అప్పగించారు. ఇంగ్లీషు భాషలో ఇటాలిక్ స్టైల్ లో ఆయన రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగం పీఠిక, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్ కలిగిన 251 పేజీల రాజ్యాంగాన్ని రాయడానికి రైజాదాకు ఆరు నెలల సమయం పట్టింది.

పాత పార్లమెంటు భవనంలో వేడుకలు

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పాత పార్లమెంటు హాలులో అతి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ (మన రాజ్యాంగం,మన స్వాభిమానం) పేరుతో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కార్ , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొంటారు. ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించి రాజ్యాంగ పీఠికను చదువుతారు. ఒక స్మారక నాణేన్ని , తపాలా బిళ్లను విడుదల చేస్తారు. 1949, నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదిస్తే, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. మన దేశం ప్రజాస్వామ్య, సార్వభౌమ, సర్వసత్తాక రాజ్యాంగంగా అవతరించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com