మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాటలో మృతుల సంఖ్యపై క్లారిటీ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్టు మహా కుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు.
గాయపడ్డ 90 మందికి ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతోంది. మృతుల్లో 25 మందిని గుర్తించినట్టు డీఐజీ తెలిపారు. ఇక ప్రయాగ్రాజ్ తొక్కిసలాట తర్వాత అఖాడా పరిషత్ కీలక ప్రకటన చేసింది. రెండోరోజు అమృత్ స్నాన్ రద్దు చేస్తున్నామని అఖిలభారత అఖాడా పరిషత్ అధ్యక్షులు రవీంద్ర పురి తెలిపారు. అయితే CM యోగీ విజ్ఞప్తితో తిరిగి స్నానాలకు వెళ్లాలని నిర్ణయించారు.
మహాకుంభమేళాకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారన్నారు సాధ్వి నిరంజన్ జ్యోతి. కుట్ర జరిగిందా అనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు సాధ్వి నిరంజన్ జ్యోతి. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగితో మాట్లాడారు. ఘటనపై ఆరా తీసి అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయ చర్యలపై సమీక్షించారు. తొక్కిసలాట ఘటనపై మహామండలేశ్వర్ ప్రేమానంద్ పురి కన్నీళ్లు పెట్టుకున్నారు. భద్రతా ఏర్పాట్లలో యూపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అధికార యంత్రాంగం VIPల సేవలో తరిస్తోందని మండిపడ్డారు.