23.2 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

15 రోజుల్లో రూ.1.14కోట్లు చెల్లించండి -ఆర్జీవీకి ఏపీ సర్కారు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు భారీషాక్‌ ఇచ్చింది. ఏకంగా లీగల్‌ నోటీసులు జారీచేసింది. పదిహేను రోజుల్లోగా రూ.1.14 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించింది. ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ను మోసగించారని రాంగోపాల్‌వర్మపై అభియోగాలు మోపింది. తప్పుడు ఇన్‌వాయిస్‌లు, ఫ్యాబ్రికేట్ చేసిన డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా రూ.1.14 కోట్లు పొందారని లీగల్‌ నోటీసుల్లో ఆరోపించింది. అప్పటి ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఉయ్యూరు గుణశశాంక్‌రెడ్డి, ఎండీ మద్దిరాల మధుసూదన్‌రెడ్డి, ఆర్జీవీ ఆర్వీ గ్రూపు భాగస్వామి గొట్టుముక్కల రవిశంకర్‌వర్మ, ఆర్జీవీ ఆర్వీ గ్రూపునకు ప్రభుత్వం ఈ నోటీసులను పంపింది. అప్పుడు వీళ్లంతా కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు ఈ మేరకు నష్టం కలిగించినట్లు లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ మొత్తానికి గానూ 12శాతం వడ్డీతో కలిపి మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని సూచించారు. ఈ గడువులోగా కట్టకపోతే జరిమానా కింద 18శాతం వడ్డీ భరించాల్సి ఉంటుందని కూడా నిర్దేశించారు. లేకుంటే సివిల్, ఇతర వనరుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ మేరకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ కె.దినేష్‌కుమార్‌ తరఫున న్యాయవాది ఈదర నాగేశ్వరరావు నోటీసులు జారీచేశారు.

తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో వ్యూహం-1, వ్యూహం-2 సినిమాలను రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించారు. ఆ సినిమాలను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన ఫస్ట్‌ షో ప్లాట్‌ఫాంపై ప్రదర్శించేందుకు గొట్టుముక్కల రవిశంకర్‌ వర్మ, రామ్‌గోపాల్‌వర్మలతో అప్పటి ఏజీఎం గుణశశాంక్‌రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు లక్షల సబ్‌స్క్రిప్షన్స్‌ వరకూ ఏకకాల చెల్లింపు కింద రూ.2 కోట్లు ఇచ్చేలా, రెండు లక్షలకంటే ఎక్కువ సబ్‌స్రిప్షన్స్‌ వస్తే ఆదాయంలో 75 శాతం ఆర్‌జీవీ ఆర్వీ గ్రూపు, 25 శాతం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ తీసుకోవాలనేది ఆ ఒప్పందంలోని సారాంశం. దీంతో, వారికి పన్నులతో కలిపి రూ.1,14,96,610 చెల్లించారు. సాంకేతిక కమిటీ అనుమతి, సిఫార్సులు లేకుండానే ఒప్పందం కుదుర్చుకుని ఈ మొత్తం చెల్లించినట్లు అధికారులు అభియోగం మోపారు.

బీఎస్‌ఎస్‌ డేటా ప్రకారం వ్యూహం పార్ట్‌-1కు 1,845 సబ్‌స్క్రిప్షన్స్, పార్ట్‌-2కు 383 సబ్‌స్క్రిప్షన్స్‌ మాత్రమే వచ్చాయి. వీటిని బట్టి చూస్తే.. పార్ట్‌-1కు రూ.1,86,225, పార్ట్‌-2కు రూ.50,046.15 మాత్రమే చెల్లించాల్సి ఉందని, కానీ, అందుకు విరుద్ధంగా అప్పటి అధికారులు రూ.1,14,96,610 చెల్లించారని నోటీసుల్లో వివరించారు. అంతేకాదు.. ఈ వ్యవహారంలో తప్పుడు ఇన్‌వాయిస్‌లు క్రియేట్‌ చేసి పార్ట్‌-1కు 1,43,357 సబ్‌స్క్రిప్షన్లు, పార్ట్‌-2కు 24,213 సబ్‌స్క్రిప్షన్లు వచ్చినట్లు చూపించారని గుర్తించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com