ఆంధ్రప్రదేశ్లో పర్యటించే విఐపిల కోసం వినియోగించేందుకు కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు అనుమతి మంజూరు చేసింది. ఈ వాహనాలను రాష్ట్రంలో పర్యటించే వీఐపీల కోసమే వినియోగించనున్నట్లు చెబుతోంది. అందుకే కొత్తగా వాహనాలను కొనుగోలు చేస్తోంది.
వాస్తవానికి అసలే ఖజానా ఖాళీగా ఉందని సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ, రాష్ట్రానికి సందర్శన కోసం వచ్చే ప్రముఖుల భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేయాలని మాత్రం తాజాగా నిర్ణయించారు. ఇందుకుగాను 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలు కోసం ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పది టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి.. వాటిని బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ వాహనాలు రాష్ట్రంలోని ముఖ్యులతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వీఐపీల కోసం ఉపయోగించనుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వాహనాలనే వినియోగిస్తూ వస్తోంది. ఇప్పుడు.. కొత్తగా వాహనాలను సమకూర్చుకోనుండడం విశేషం. ఏపీలో పర్యటించే విఐపిల కోసం ఈ వాహనాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. పర్యాటక ప్రాంతాలు, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల సందర్శనతో పాటుగా వ్యాపార, రాజకీయ కారణాలతో పలువురు వీఐపీలు రాష్ట్రానికి వస్తుంటారు. అలాగే ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ మీద ఫోకస్ పెట్టిన తరుణంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తరచూ పర్యటిస్తుంటారు. అందుకే, ఏపీలోని ప్రముఖులతో పాటు రాష్ట్రానికి వచ్చే ముఖ్యులకు రక్షణగా ఉంటాయనే ఉద్దేశంతో కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. కొత్త వాహనాలు కాబట్టి.. సరికొత్త హంగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
అయితే, గతంలో వైసీపీ సర్కార్ వాహనాలను ఇదే మాదిరిగా కొనుగోలు చేసింది. ఆ సమయంలో టీడీపీ చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అప్పట్లో ఆరోపణలు చేసింది టీడీపీ. అయితే, ఇప్పుడు సెక్యూరిటీ వాహనాలు ఉన్నా.. అదనంగా కొనుగోలు చేస్తుండడం గమనార్హం. 8 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆర్భాటాలకు దూరంగా ఉంటామని ప్రకటించింది. ఇదే నిర్ణయాన్ని కూటమి పార్టీల ప్రజాప్రతినిధులకు వర్తింప జేసింది. కానీ, ఇప్పుడు ఏకంగా ప్రముఖుల పేరుతో దాదాపు పది కోట్ల రూపాయలు కేవలం వాహనాలకే ఖర్చు చేస్తుండడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నిర్ణయంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలో లేనప్పుడు విమర్శించిన వాళ్లు.. ఇప్పుడు అదే తరహా నిర్ణయం తీసుకోవడంపై సోషల్ మీడియాలో నెగెటివ్ క్యాంపెయిన్ నడుస్తోంది.