ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29, 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై పెదవి విరిచారు. డీపీఆర్ స్థాయిని దాటి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును మన రాష్ట్రంలో సద్వినియోగం చేసుకోవడం లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతోందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయిన దృష్ట్యా పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.