ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఫైర్ అయ్యారు. సమయ పాలన పాటించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైళ్ల క్లియరెన్సులో జాప్యంపైనా కన్నెర్ర జేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబులో కన్ఫ్యూజన్ కనిపించింది. అధికారులు పంక్చువాలిటీ పాటించడం లేదన్న కోపంతో పాటు.. వాళ్లను గట్టిగా మందలిస్తే.. ఎట్నుంచి ఎటొస్తుందో అన్న సందిగ్ధం చంద్రబాబులో కనిపించింది. అందుకే వాళ్లను సుతిమెత్తగా మందలించారు.
లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ రీ డెడికేట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే, అధికారులు అహం వీడాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తవుతున్న సందర్భంగా అధికారులు, మంత్రుల పనితీరును ఇకపై సమీక్షిస్తానన్నారు. మంత్రులు, అధికారుల సమీక్షలో పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సేవకులన్న విషయాన్ని మంత్రులు, అధికారులు విస్మరించొద్దన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశాల్లో నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్‌పై అధికారులే నిర్ణయం తీసుకోవాలన్నారు. అందరం కలిసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను నెరవేర్చడంపైనే దృష్టిపెట్టాలని సూచించారు. ఎక్కడికక్కడ ఇన్నవేటివ్ ప్రాక్టీసెస్‌తో ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారు. అలాగే, డబ్బులు లేవని పనులు నిలిపేయొద్దని, ఆ సమస్యను ఎలా అధిగమించాలో అన్వేషించాలని, పరిష్కారం గుర్తించాలన్నారు.
మరోవైపు.. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా.. కొందరు అధికారుల వ్యవహార శైలితో చెడ్డపేరు వస్తుందన్నారు చంద్రబాబు. ఈ క్రమంలో కొందరు అధికారుల తీరును తప్పుబట్టారు. అలాంటివాళ్లు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
అధికారులపై ఒక బాధ్యత ఉందని, వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్ అని, ఇది సొసైటీకి అత్యంత కీలకమని అన్నారు చంద్రబాబు. ఇంత మంది ప్రజల్లో ఇక్కడున్న మంత్రులుగా ఎంతమందికి అవకాశం వస్తుందో ఆలోచించుకోవాలని, అలాగే, ఇక్కడున్న ఆఫీసర్లలో ఈ స్థాయికి రావడానికి ఎంతమంది ఆఫీసర్లు ఇక్కడిదాకా వస్తారో ఆలోచించాలనన్నారు. లక్ష్య సాధన కోసం రీ-డెడికేట్ కావాలని సూచించారు. అంతేకాదు.. ఎవరైతే ఉత్వమంగా తమ బాధ్యతలు నెరవేరుస్తారో వాళ్లకే మనుగడ ఉంటుందని సుతిమెత్తగా చురకలు అంటించారు ఏపీ సీఎం చంద్రబాబు.
వాస్తవానికి మంత్రులు, కార్యదర్శులతో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో పాటు.. ఆయా విభాగాల అధిపతులు కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే, చంద్రబాబు ఈ సమావేశానికి ఐదు నిమిషాల ముందుగానే వచ్చారు. కానీ, మంత్రులు, కార్యదర్శులు సమయానికి చేరుకోలేదు. వాళ్లకోసం పది నిమిషాల పాటు చంద్రబాబు ఐదో బ్లాక్‌లోనే వేచి ఉన్నారు. సమావేశానికి వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలకాల్సిన సీఎస్ విజయానంద్ కూడా సమయానికి చేరుకోలేదు. చివరకి చంద్రబాబు పొలిటికల్ సెక్రెటరీ ఆయనకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సీఎస్ విజయానంద్ సహా ఇతర అధికారులు వచ్చారు. దీంతో, సమావేశం ప్రారంభమయ్యాక చంద్రబాబు.. మంత్రులతో పాటు అధికారులను కూడా మందలించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్షించి, ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని, వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. ఆర్థికేతర ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదని, ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను ఆరు నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు.