– పట్టాభి ఆగ్రో పయ్యావుల బంధువుదేనా?
– కాకినాడ పోర్టు స్టెల్లార్ షిప్ వ్యవహారంలో కొత్త కోణం
కాకినాడ పోర్టునుంచి పీడీఎస్ రైస్ అక్రమ రవాణా వ్యవహారం , దానిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా స్టైల్ చెకింగ్ అంతా డ్రామాలా నడుస్తోంది. వాస్తవానికి పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ నిర్వహిస్తున్నారు. అయినా పవన్ ఇందులో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. పోనీ డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించారనుకున్నా.. ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ ని మళ్లీ సీజ్ చేయడం వింతల్లోకే వింత. పవన్ తనిఖీ హంగామా సాగినంత సేపు మంత్రి నాదెండ్ల చేతులు కట్టుకుని వినయ పూర్వకంగా నిలబడ్డారు. కాకినాడ పోర్టులో బియ్యం రవాణా దశాబ్దాలకాలం నుంచి ఉంది.చాలా మంది రాజకీయ నాయకులు ఈ వ్యాపారం చేస్తున్నారు. అయినా ఇందులో అక్రమాలు జరిగితే విచారించాల్సిందే. బాధ్యులను శిక్షించాల్సిందే. అయితే పోర్టులో స్టెల్లార్ షిప్ తనిఖీ పేరుతో పవన్ చేసిన హంగామా మాత్రం ఆయన అప్ కమింగ్ మూవీ ఓమై గాడ్ గ్లింప్స్ ను మించిపోయింది. పోర్టులోనే రెండు గంటల పాటు నానా హడావుడి చేసిన పవన్ చివరికి సీజ్ ది షిప్..ఏవైనా ప్రాబ్లెమ్ వస్తే నేను కేంద్రంతో మాట్లాడతాను అన్నారు. రైస్ అక్రమ రవాణా మాటున ఉగ్రవాదులకు అడ్డాగా పోర్టు మారిపోయే ప్రమాదముందని తేల్చారు. రైస్ అక్రమ రవాణాకు కారకులను ఎంత వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అయితే స్టెల్లార్ షిప్ కు కొద్ది దూరంలోనే కెన్ స్టార్ అనే షిప్ లో కూడా సరుకు లోడింగ్ అవుతోంది. అది కూడా కార్గొ షిప్పే. అందులోనూ బియ్యమే రవాణా అవుతున్నాయి. ఆ షిప్ జోలికి మాత్రం పవర్ స్టార్ వెళ్ల లేదు. పైగా స్టెల్లార్ షిప్ ను అంతకు రెండురోజులముందే కలెక్టర్ సీజ్ చేశారు. దర్యాప్తు ఓ క్రమంలో సాగుతోంది. అయితే పవన్ సీజ్ అయిన షిప్ నే మళ్లీ సీజ్ సీజ్ అంటూ హడావుడి చేశారు.దీని బదులు కెన్ స్టార్ షిప్ ను చెక్ చేసి దానిని సీజ్ చేసినా కొంత బాగుండేది. జనసేన కార్యకర్తలు పవన్ పోర్టు సందర్శనను సినిమా టిక్ రేంజ్ లో సోషల్ మీడియాలో హై లైట్ చేస్తున్నారు. అయితే అంతకు మించి రెట్టింపు స్థాయిలో మీమర్లు, ట్రోలర్లు కూడా చెలరేగారు. సీజ్ అయిన షిప్ ని సీజ్ చేయడమేనా మీ స్పెషాలిటీ అంటూ పవన్ ను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.
పీడీఎస్ అక్రమ రవాణా ఎక్కడనుంచి?
వాస్తవానికి పోర్టులలో రైస్ తరలింపు చాలా చాలా కామన్ వ్యవహారం. కాకినాడ, క్రుష్ణ పట్నం పోర్టుల నుంచి ఏపీ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా రైస్ తరలిస్తుంటారు. అయితే అన్ని చెకింగ్ లు అయ్యాకే అవి సక్రమమా? లేక అక్రమమా అన్నది తేల్చాలి. తెలుగు రాష్ట్రాల్లో పీడీఎస్ రైస్ తరలింపు అనేది వ్యవస్థీక్రుత నేరం. దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఈ అక్రమాలను ప్రభుత్వాల ద్రుష్టికి వచ్చినప్పుడు దర్యాప్తులు, విచారణలు జరగడం మామూలే. వాస్త వానికి కాకినాడ పోర్టులో పట్టుబడ్డ రైస్ పట్టాభి ఆగ్రో అనే సంస్థ పంపుతున్నవి అని ఇప్పుడు వార్తలొస్తున్నాయి. పట్టాభి ఆగ్రో మరెవరిదో కాదు. ప్రస్తుత ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిది. అధికారుల దర్యాప్తులో ఈ విషయం వెల్లడి కావడంతో కూటమి నేతలకు తలలెక్కడ పెట్టుకోవాలో అర్జం కావడం లేదు.
పవన్ లక్ష్యం ఎవరు?
పవన్ కల్యాణ్ కు వైసీపీ నేత ద్వారపూడి చంద్రశేఖర్ ఎప్పటినుంచో టార్గెట్.. మొన్నటి ఎన్నికల ప్రచారంలో కూడా వారిద్దరి మధ్య మాటల తూటాలు ఒక రేంజ్ లో పేలాయి.కాకినాడ నడిబొడ్డున ఇద్దరూ తీవ్రాతి తీవ్రమైన పదజాలంతో సవాళ్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ద్వారంపూడిని కార్నర్ చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. ద్వారంపూడికి రైస్ రవాణా బిజినెస్ ఉంది. రెండు తరాలనుంచి ఆ కుటుంబం ఈ వ్యాపారంలో ఉంది. ద్వారంపూడిని ఇరుకున పెట్టాలని బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న వార్తలు రాగానే హుటాహుటిన అక్కడకు వెళ్లి ఏదో చేయబోయి పవన్ అడ్డంగా బుక్ అయిపోయారు. తీరా ఇప్పుడు ఇంత రచ్చ అయ్యాక మంత్రి పయ్యావుల నోరు విప్పక తప్పింది కాదు. పట్టాభి ఆగ్రో తన వియ్యంకుడిదేనని …కానీ వారు చాలా సిన్సియర్ వ్యాపారులని, ఎలాంటి తప్పిదాలకు పాల్పడరని మూడు తరాలుగా ఈ ఎక్స్ పోర్ట్ బిజినెస్ సాగుతోందని పయ్యావుల వివరణ ఇచ్చారు.
హోం వర్క్ సరిగా లేదా?
డిప్యూటీ సీఎం పవన్ బియ్యం అక్రమ రవాణా పట్టుకోడం విషయంలో సినిమాటిక్ గా పోయారు తప్ప వ్యూహం కొరవడింది. ఏది ఎలా చేయాలో ఒక ప్రణాళిక లేకుండా బియ్యం దొరికాయనగానే పోర్టుకు వచ్చేసి నోటి కొచ్చినది మాట్లాడేయడమేనా? అవి ఎవరివో..అక్రమమా? లేక సక్రమమా అన్నది విచారణ లేకుండా పవన్ కల్యాణ్ స్థాయి వ్యక్తి చేయాల్సిన పనేనా? తనది కాని శాఖలో వేలు దూర్చి పూర్తివివరాలు తెలుసుకోకుండానే దూకుడుగా ముందుకు అడుగులేయడం వల్ల బూమరాంగ్ అయ్యింది.
తప్పుదారి పట్టించారా?
నిజానికి పవన్ని ఎవరైనా తప్పుదారి పట్టించారా? పబ్లిగ్గా పరువు తీసే కార్యక్రమం పెట్టుకున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి ఈ ఎపిసోడ్ని రెండురోజుల నుంచి గమనిస్తున్నవారికి. డిప్యూటీసీఎం స్థాయి వ్యక్తి ఒక చెకింగ్ కు వెడుతుంటే ఆ విషయం కేబినెట్ లో సీఎంకు తెలియకుండా ఉండదు. సీఎం కు ఇంటెలిజెన్స్ నిఘా ఎప్పటికప్పుడు అన్నీ తెలియ చేస్తూనే ఉంటుంది. సీఎం కు తెలిసే పవన్ ఈ చెకింగ్ తతంగం నడిపారా? పరువుపోతే అది కూటమి ప్రభుత్వం మొత్తానికి అవమానమేగా? అసలు పట్టుబడిన బియ్యం ఎవరివి? ఏమిటి అనే ప్రాథమిక విచారణ కూడా చేసుకోరా? పోనీ సీన్ లోకి వచ్చాకైనా అన్నీ గమనించి ఆచి తూచి మాట్లాడరా? కాకినాడ్ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. షిప్ సీజ్ చేయడం గురించి కేంద్రంతో మాట్లాడతాను అనడమేమిటి?
పీడీఎస్ రైస్ ఎక్కడనుంచి తరలుతున్నాయి?
బియ్యం అక్రమ రవాణా అన్నది రెండు తెలుగు రాష్ట్రాలను పీడిస్తున్న ఒక వ్యవస్థీక్రుత సమస్య. ఒక పెద్ద మాఫియా నెట్ వర్కే నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఈ ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలోనూ ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆరోపణలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతెందుకు పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజక వర్గంలోచేబ్రోలు లాంటి ప్రాంతాల్లో పీడీఎస్ రైస్ తరలింపు వార్తలు ఎన్నోసార్లు వెలుగు చూశాయి. పీడీఎస్ రైస్ మాఫియా తెగబడుతున్న దారుణాలపై అన్ని పత్రికల్లోనూ పెద్దఎత్తున కథనాలే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ డీలర్లందరూ టీడీపీ నేతలే.. వారి కూటమి తరపు వారే. పీడీఎస్ రైస్ ను రేషన్ డీలర్లే ఒక ముఠాగా ఏర్పడి తరలిస్తుంటారు. చెక్ పోస్టుల దగ్గర చెకింగ్ లేకపోవడం, అధికార్లకు లంచాలిచ్చి లారీలను వదిలేయడం మామూలైపోయింది. మరి దిద్దు బాటు చర్యలు అక్కడ మొదలవ్వాలిగా? అదేం లేకుండా పోర్టు దగ్గరకొచ్చి హడావుడి చేయడం ఎందుకు? పైగా పట్టుబడిన బియ్యాన్ని సరిగా చెక్ చేయకుండా ప్రతిపక్ష నేతలదే అయి ఉంటుందనే తొందరపాటు నిర్ధారణకు రావడం ఎందుకు?
అసలు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం వాడుతున్నదెవరు? దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు సైతం ఆ బియ్యాన్ని తీసుకోవడం లేదు. రేషన్ డీలర్ దగ్గరే వాటిని ఇచ్చేసి డబ్బులు తీసేనుకుంటున్నారు. దాదాపుగా అన్ని చోట్ల ఇదే అలవాటు కొనసాగుతోంది.నాణ్యతలేని ఆ బియ్యాన్ని రేషన్ షాపులకు పంపడం ఎందుకు? ఇది వ్యవస్థీక్రుత నేరాలను ప్రోత్సహించడం కాదా? అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా ఇలాంటి నేరాలను అరికట్టడానికి చిత్తశుద్ధితో పనిచేయాలి. అంతేకాని ప్రతి పక్షాన్ని ఏదో చేసి ఇరికిద్దామని సినిమాటిక్ స్టంట్లు చేస్తే అసలు సంగతి మాట దేవుడెరుగు.. ఉన్న పరువు పోవడం ఖాయం.