సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో అందరూ మహిళలే ఉండేలా ప్రత్యేక మహిళా బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు దేశ భద్రతలో మహిళామణుల పాత్ర పెంచాలనే సంకల్పంతో హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ లో మహిళల భాగస్వామ్యం 7 శాతం మాత్రమే ఉంది. తాజాగా మహిళా బెటాలియన్నుఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో మహిళల భాగస్వామ్యం పెరగనుంది. కొత్త బెటాలియన్ కు సత్వరం నియామకాలు జరపడం, ఆ సేనాదళానికి అవసరమైన శిక్షణను ఇవ్వడం, బెటాలియన్ కు ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన చోటును ఎంపిక చేయడం వంటి సన్నాహాలను సీఐఎస్ఎఫ్ ప్రధాన కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టింది. కమెండోలుగా ఉంటూ వీఐపీల భద్రతకు సంబంధించిన విధుల నిర్వహణకు, అంతేకాకుండా విమానాశ్రయాలలోనూ, ఢిల్లీ మెట్రో రైల్ కు సంబంధించి.. ఇలా బహుముఖ భూమికలను నిర్వర్తించడానికి సమర్ధత కలిగిన ఒక విశిష్ట బెటాలియన్ ను ఏర్పాటు చేయడానికంటూ ప్రత్యేకంగా ఓ శిక్షణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఐఎస్ఎఫ్ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సీఐఎస్ఎఫ్ లో అందరూ మహిళలే సభ్యులుగా ఉండే సేనాదళాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కార్యరూపానికి శ్రీకారంచుట్టారు.