అయోధ్య ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. యేడాది క్రితం బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన విషయం తెలిసిందే. అయితే, అయోధ్య ఆలయ నిర్మాణం మూడు దశల్లో చేపట్టారు. మొదటి దశ పూర్తికాగానే ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఇతర ఆలయాల నిర్మాణం మొదలయ్యింది. ఈ నిర్మాణాలకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. బాలరామాలయం పరిసరాల్లో నిర్మిస్తోన్న సూర్య, గణేష్, శివ, దుర్గ, అన్నపూర్ణ, హనుమాన్ ఆలయాల నిర్మాణం పూర్తికావస్తోందని తెలిపింది. ఇప్పటికే వీటికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. అందమైన శిల్పాలు, కొన్ని ఆలయాల గోపురాలు సిద్ధమయ్యాయి.
మరోవైపు.. అయోధ్య ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య ప్రాణప్రతిష్ట వార్సికోత్సవాన్ని వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన కాకుండా.. జనవరి 11వ తేదీనే జరపాలని నిర్ణయించింది. ఆ రోజున కుర్మ ద్వాదశీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పండితులు తెలిపారు. నిజానికి జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో బాలరాముడి పునఃప్రతిష్ట జరిగింది.