వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్‌జైన్‌పై దాడి కేసులో నిందితుల కుటుంబసభ్యులు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిశారు. తమ భూములను కోల్పోతున్నామని కమిషన్ దృష్టికి కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. ఐదు గ్రామల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా పోలీసులు అక్రమ కేసులు పెట్టి తమ కుటుంబ సభ్యులను జైల్లో పెట్టారని కమిషన్‌కు కుటుంబసభ్యులు తెలిపారు. నిందితుల కుటుంబ సభ్యులకు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు మద్దతు తెలుపుతూ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనుల భూమి మాత్రమే ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అధికారం , దురహంకారం గిరిజనులపై చూపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ ప్రయత్నాన్ని విరమించుకొని, గిరిజనులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక, వికారాబాద్ జిల్లాలో దాడులు జరిగింది అధికారుల మీద కాదని.. వాస్తవంగా గిరిజన ప్రజల మీద దాడులు జరిగాయని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. గిరిజన మహిళలఫై దాడులు చేసిన పోలీసులపై SC, ST కేసులు పెట్టాలని కమిషన్ ను కోరామన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించి కమిషన్ న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రజలకు SC ST కమిషన్ న్యాయం చేస్తుందని నమ్ముతున్నామన్నారు.