37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

‘రుణ’ యాప్ బాధితుల్లో విద్యావంతులే అధికం – హోంమంత్రి

గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందని శాసనసభలో హోంమంత్రి అనిత వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టే అంశంపై శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (రాజమండ్రి) , రెడ్డప్పగారి మాధవిరెడ్డి(కడప), సుందరపు విజయ్ కుమార్ (యలమంచిలి) అడిగిన ప్రశ్నలకు ఆమె గురువారం జరిగిన సభలో సమాధానం ఇచ్చారు. 2014-19 ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే 2019 – 24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. ఏజెన్సీ ఏరియాల నుంచి చిన్నపిల్లల స్కూల్ బ్యాగుల్లోకి గంజాయి వచ్చి చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి కట్టడిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

గంజాయి రవాణా రాష్ట్నమంతటా జరుగుతున్నా..వైసీపీ పాలనలో చెక్ పోస్టుల్లో కనీసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని హోంమంత్రి మండిపడ్డారు. ఐదు నెలల పాలనలో సుమారు 25 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగలిగామని, 916 మందిపై కేసులు కూడా నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. తాజాగా రాజమండ్రిలో ఒక ఫార్మాసిస్ట్.. జైల్లో ఉన్న నిందితుడికి గంజాయి అందించిన ఘటనలో నిఘా అధికారులు అతన్ని గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించడమే అప్రమత్తతకు ఒక ఉదాహరణగా వివరించారు.

బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అడ్డుకునేందుకు నేరస్థుల వివరాలతో ప్రొఫైలింగ్ చేస్తున్నట్టు తెలిపారు. అనుమానిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా పోలీస్ శాఖను ఆదేశించడం జరిగిందన్నారు. రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు.

లోన్ యాప్స్ అరాచకాలు, బలవంతపు వసూళ్లపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం వెల్లడించారు. లోన్ యాప్స్ వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు 212 మంది ఇబ్బందిపడినట్లు బాధితులను గుర్తించామన్నారు. ఈ యాప్ కు సంబంధించిన వారి బెదిరింపులకు భయపడి 8 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఆమె స్పష్టం చేశారు. గూగుల్ ప్లేస్టోర్ లో 456 నకిలీ రుణ యాప్ లను గుర్తించి వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. గో క్యాష్, లోన్ బారో, క్యాష్ బనానా, లింక్ లోన్ వంటి యాప్ లను ఉదాహరణగా పేర్కొన్నారు.

ఇప్పటికే 229 యాప్ లను ప్లే స్టోర్ లో బ్లాక్ చేయించడం జరిగిందన్నారు. వేధింపులకు పాల్పడిన యాప్ లకు సంబంధించి ఏకంగా 199 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామన్నారు. అక్రమ వసూళ్లు, వేధింపులకు పాల్పడే 1138 మొబైల్ స్పామ్ కాల్స్ నంబర్లను గుర్తించి టెలికం డైరెక్టర్ కు ఫిర్యాదు చేసి వాటిని బ్లాక్ చేయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా మోసాలకు గురైతే 1930 హెల్ప్ లైన్ లో సంప్రదించాలని కోరారు. ఈ తరహా ఘటనలలో చదువుకోని వారితో పాటు చదువుకున్న వారు కూడా బలవుతున్న నేపథ్యంలో దీనిపై మరింత విస్తృత చర్చ జరగాలని హోంమంత్రి పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com