ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. అసలు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్ధే మనుగడలో లేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి శాసనమండలి వేదికగా స్పష్టం చేశారు. బుధవారం మండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ వాలంటీర్ల వ్యవస్ధ గత ఏడాది ఆగస్టుతోనే ముగిసిందని, ఆ తరువాత ప్రభుత్వం రెన్యువల్ జీఓ ఇవ్వలేదని మంత్రి డోలా చెప్పారు. వాలంటీర్ల వ్యవస్ధే లేనప్పుడు గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి 10 వేల రూపాయలు ఎలా పెంచగలమని మంత్రి డోలా ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని పది వేలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ ఇప్పుడు రెన్యువల్ జీఓ ఎందుకు తీసుకు రావడం లేదని మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు.
- Advertisement with us -