తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. మహిళలను లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు. ఇందులో భాగంగానే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం మహిళలకు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం-ప్రజా పాలన -ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు హాజరై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టిన భట్టి.. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారతకు కృషి చేశామని గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు చేశామని ఈ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం మహిళలకు కల్పిస్తున్నామన్నారు. మహిళల కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని.. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ విషయం చెప్పేందుకే ఇక్కడ సభ పెట్టామని తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మారిస్తే దాన్ని చక్కదిద్దుతున్నామన్నారు. వరంగల్ పట్టణాభివృద్ధికి దాదాపు 6 వేల కోట్ల నిధులను మంజూరు చేశామని, ఇది తెలంగాణ చరిత్రలోనే ఓ పట్టణాన్ని మహానగరంగా మార్చేందుకు చేస్తున్న ప్రక్రియ అన్నారు. తాము మాటలు చెప్పి వెళ్లడానికి రాలేదు. ఇది కాంగ్రెస్ నిబద్ధత అన్నారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించి తానే కుర్చివేసుకుని కూర్చుని జర్నలిస్టు కాలనీ కట్టిస్తానని మాట ఇచ్చాడని, దావత్ కూడా కావాలని అడిగారని, కానీ ఆయన కుర్చీ వేసుకున్నది లేదు.. కాలనీ కట్టింది లేదన్నారు. దావత్ ఇద్దామంటే కేసీఆర్ కనిపించడం లేదని సెటైర్ వేశారు. తాము వరంగల్ జిల్లాకు నిధులు ఇస్తామని మాట ఇవ్వడమే కాకుండా కేవలం ఆరు నెలల్లోనే కాళోజీ కళాక్షేత్రం పూర్తయ్యేందుకు నిధులు కేటాయించి ఇవాళ ప్రారంభించుకున్నామని చెప్పారు.