- కన్నుల పండువగా మదురై మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం
- 14వ రోజు ఘనంగా కోటి దీపోత్సవం
భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో ఇంతటి అద్భుత కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. త్రిలింగ దేశంగా విరాజిల్లుతోన్న తెలంగాణ గడ్డపై కార్తీక మాసంలో కోటి దీపోత్సవం నిర్వహించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతున్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలను కోటిదీపోత్సవం వేదిక మీద నుంచి ప్రస్తావించారు. ఇప్పటివరకు ఈ వేదికమీద 200 కల్యాణాలు జరగడం ఎంతో విశేషమన్నారు. కోట్లాది మంది భక్తులు నిత్యం టీవీల్లో ఈ ఉత్సవాలను లైవ్‌లో వీక్షిస్తున్నారన్నారు. కోటి దీపోత్సవానికి రాని ప్రవచన కర్త లేరని.. దీవెనలు అందించని పీఠాధిపతి లేడంతే అతిశయోక్తి లేదన్నారు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న భక్తిటీవీ కోటి దీపోత్సవానికి రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం నుంచే తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దోమల్‌గూడ మార్గాలు కిక్కిరిసిపోతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవానికి తరలివచ్చి.. పూజల్లో పాల్గొంటున్నారు. భక్తిశ్రద్ధలతో కోటి దీపాలు వెలిగిస్తున్నారు.
కాగా, కోటి దీపోత్సవం 14వ రోజు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వర్‌రావు దంపతులు కూడా 14వ రోజు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మదురై మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణాన్ని అశేష భక్తజనంతో కలిసి తిలకించారు.
కార్తీక శుక్రవారం వేళ విశేష కార్యక్రమాలను నిర్వహించారు. పద్నాలుగో రోజు వేడుకల్లో… బృందావనం ఆనందధామం సద్గురు రితేశ్వర్ స్వామి ఆశీర్వచనం, బ్రహ్మ శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనం, శ్రీకృష్ణతత్త్వంపై డా.ఎల్వీ గంగాధరశాస్త్రి గాన ప్రవచనం అలరించాయి. ఆ తర్వాత.. జగన్మాత వైభవం, భక్తులచే కనకదుర్గమ్మకు కోటిగాజుల అర్చన మధురాతి మధురంగా చేశారు. అలాగే.. ఉడిపి శ్రీకృష్ణ నవనీతపూజ, మధురై మీనాక్షీసుందరేశ్వరుల కల్యాణం చూసి భక్తులు తిలకించి తరించిపోయారు. ఆదిదంపతులు నందివాహనంపై భక్తులను అనుగ్రహించారు. చివరలో లింగోద్భవం, సప్తహారతులు, మహానీరాజనంతో 14వ రోజు కోటి దీపోత్సవం వైభవంగా ముగిసింది.