లగచర్లలో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్ల బాధిత రైతులను సంగారెడ్డి జైల్లో ఈరోజు(శుక్రవారం) ములాఖత్ అయి పరామర్శించిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. లక్షల రూపాయల విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటారన్నారు.
కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని, గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డి యే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడని ప్రశ్నించారు.
కేటీఆర్ కామెంట్స్
జైల్లో ఇప్పుడు మేము 16 మందిని కలిశాం. వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉంది. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారు.
ఇంకొక తమ్ముడు వనపర్తి లో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారు. ఘటనతో సంబంధం లేని వాళ్లను జైల్లో పెట్టారు. ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారు. దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారు. దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్ లో రాజ్యంగేతర శక్తి గా మారాడు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నాడు. కొడంగల్ లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని చెబుతున్నారు.
నిజానికి దాడి చేసిన వారిలో కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు. భూములు పోతాయని వాళ్లే దాడి చేశారు. అరెస్ట్ చేసిన 70 మందిలో బీఆర్ఎస్ చెందిన 21 మందిని మాత్రమే చిత్ర హింసలు పెట్టి కేసులు పెట్టారు. మిగతా కాంగ్రెస్ వాళ్లను వదిలేశారు. దాడి జరిగిన వీడియోల్లో కాంగ్రెస్ వాళ్లు కనబడుతున్నారు. వాళ్ల చేతగాని తనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారు.
21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే. వికారాబాద్ ఎస్పీ, సీఐలు, ఎస్ఐలు వారిని చిత్ర హింసలు పెట్టారు. మూడు మూడు గంటల పాటు కొట్టారు. మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని వాళ్లు మాకు చెప్పారు.
రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరుండేది ఐదేళ్లు మాత్రమే. అధికారం శాశ్వతమని భావించకండి. నువ్వు చక్రవర్తి వి కాదు. నీలాంటి చాలా మందిని చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు గుంజుకుంటా అంటే మేము ఊరుకోం.
రేవంత్ రెడ్డి పై ఇవ్వాళ కొడంగల్ మర్లవడ్డది. రేపు తెలంగాణ మొత్తం మర్లవడతది. కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు. మేము అధికారంలోకి వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం. రైతులను వదిలేయ్. నువ్వు అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తాకుతది.
21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుంది. రాఘవేంద్ర అనే ఉద్యోగి తన ఉద్యోగం కోసం భయపడుతున్నాడు. ఆయన ఉద్యోగం పోకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం. మిగతా బాధిత రైతులకు కూడా చెబుతున్నా మీరు భయపడకండి. ఇంతకంటే మిమ్మల్ని వాళ్లు ఏం చేసేది లేదు. ఉరి శిక్ష వేయరు. ధైర్యంగా ఉండండి.
ఫార్మా విలేజ్ పేరుతో తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడు. 30, 40 కిలోలు కూడా లేని పిల్లలపై అంటెంప్ట్ మర్డర్, కలెక్టర్ పై దాడులు చేశారంటూ కేసులు పెట్టారు. పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న పిల్లలపై కేసులు పెట్టటానికి నీకు మనసేలా వచ్చింది రేవంత్ రెడ్డి.
ఫార్మా విలేజ్ పేరుతో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే భూముల దందా చేస్తున్నారో ఆయా ప్రాంతాల్లో రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. జ్యోతి అనే గర్భిణీ మహిళ భర్తను అరెస్ట్ చేశారు. ఆమె ఎంతో ఆవేదనతో ఉంది. ఆ మహిళకు వైద్యం సాయం అందిస్తాం. బీఆర్ఎస్ పేదలు, ప్రభుత్వ బాధితుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుంది.