సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో న్యాయస్థానం ఆదేశం మేరకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేశారు. నాంపల్లి స్పెషల్ కోర్టులో సురేఖ తన వాదనలు వినిపిస్తూ కౌంటర్ వేశారు. ఆమె తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయంగా కేటీఆర్‌పై విమర్శలు చేయబోయిన కొండా సురేఖ.. సినీ నటుడు నాగార్జున కుటుంబసభ్యులను ప్రస్తావిస్తూ అనుచిత ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లో సినీరంగ ప్రముఖులంతా ఒక్కటయ్యారు. కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, నాగార్జున మాత్రం నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఇప్పుడు కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేశారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని సురేఖ న్యాయస్థానానికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.