తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో జైలు కెళ్లిన నటి కస్తూరికి ఊరట లభించింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కస్తూరిని గత శనివారం చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఆమెను అదుపులోకి తీసుకుని చెన్నైకు తరలించారు.
ఈ కేసులో ఆమెకు చెన్నై ఎగ్మోర్ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని చెన్నైలోని ఎగ్మోర్ ఫుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కస్తూరి ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి దయాళన్.. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
తమిళనాడులో ‘హిందూ మక్కల్ కచ్చి’ పార్టీ ఇటీవల ఏర్పాటు చేసిన సభలో నటి కస్తూరి ద్రవిడ పార్టీలనుద్దేశించి.. ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులను పరాయివాళ్లుగా చూడటం సరికాదంటూ.. తెలుగువారి పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులోని రాజుల అంతఃపురంలో పని చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లను తమిళనాడు స్థానికులుగా భావిస్తూ, బ్రాహ్మణులను మాత్రం పరాయి వాళ్లుగా చూడటం ఏంటని కస్తూరి ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో కస్తూరి వివరణ కూడా ఇస్తూ.. ద్రవిడ పార్టీలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయన్నారు.