సద్గురు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలోని ఈశా యోగా సెంటర్ ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. దేశ గ్రామీణ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా 2004 నుంచి గ్రామోత్సవం పేరుతో ఈశా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో, పట్టణీకరణ వల్ల తరచూ మరుగున పడుతున్న గ్రామీణ జీవన విధానాన్ని, అక్కడి ప్రత్యేక సాంప్రదాయాలకూ ఈశా గ్రామోత్సవం ప్రాముఖ్యతనిస్తోంది. గ్రామీణ ఆటలు, కళ, నృత్యం, నాటకం, సంగీతం, ఆహారం, కట్టు బొట్టు వంటి విలక్షణమైన స్థానిక గ్రామీణ భారతదేశ సంస్కృతులను ప్రదర్శించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈశా గ్రామోత్సవంలో భాగంగా పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్‌తో పాటు.. గ్రామీణ ఆటలు, సంప్రదాయ కళల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈశా గ్రామోత్సవంలో ఇప్పటివరకు 8,412 జట్లు, 1,00,167 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇంకా పుదుచ్చేరి రాష్ట్రాల్లో 126 ప్రదేశాల నుండి 80,000 మందికి పైగా క్రీడాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 26 జిల్లాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. నవంబర్ 16 నుండి మొదలైన ఈ కార్యక్రమం డిసెంబర్ 28 వరకు జరుగుతుంది. జిల్లా స్థాయిని క్లస్టర్‌గా, రాష్ట్ర స్థాయిని డివిజన్‌గా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇక, దక్షిణ భారత దేశ రాష్ట్రాలకు సంబంధించి.. 3 దశల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రతీ స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు మెరిట్ సర్టిఫికెట్, నగదు బహుమానం అందిస్తారు.ఫైనల్ ఈవెంట్ డిసెంబర్ 28వ తేదీన కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ ఆదియోగి ప్రాంగణంలో జరగనుంది. విజేతలుగా నిలిచిన పురుషుల వాలీబాల్ జట్టుకు రూ.5లక్షలు, మహిళల త్రోబాల్ జట్టుకు రూ.5లక్షలు బహుమానంగా అందిస్తారు. అలాగే, ఇతర జట్లకు కూడా నగదు బహుమానాలు అందించనున్నారు.