29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

తెలంగాణ భూభారతి చట్టంలో ప్రధానాంశాలు

– అసెంబ్లీలో చదివి వినిపించిన మంత్రి పొంగులేటి
– ధరణికి చెల్లుచీటీ, పకడ్బందీగా భూ భారతి

తెలంగాణ భూభారతి చట్టాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో భూ భారతి బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా పలు అంశాలపై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా 1971లో ప్రవేశపెట్టిన భూ చట్టం 49 యేళ్లపాటు ఎంతగానో ఉపయోగపడిందన్న పొంగులేటి.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన చట్టంలో అనేక లోపాలున్నాయన్నారు. ఆ తప్పులను అధ్యయనం చేసి భూ భారతి ద్వారా సరిదిద్దబోతున్నామన్నారు.

కొత్త చట్టంలో ప్రయోజనాంశాలు :

కొత్త చట్టం ద్వారా పార్టు-బీ లో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందన్నారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావు లేకుండా ఎంజాయ్‌మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని పొంగులేటి చెప్పారు. రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారసత్వం, వంశపారంపర్య భూములకు సంబంధించి.. సేల్ డీడ్, వారసత్వం కాక కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ పవర్స్ ఆర్డీవోకు ఉంటాయన్నారు. సాదా బైనామాకు సంబంధించి.. 2020 నవంబరు 10 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన సుమారు 9.24 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరుకుతుందన్నారు. దేశంలో ప్రతీ పౌరుడికి ఆధార్ నెంబర్ ఉన్నట్లే.. తెలంగాణలో భూములకు భూధార్ నంబర్ వ్యవస్థ తీసుకొస్తున్నామన్నారు. జమాబందీ, గ్రామ రెవెన్యూ రికార్డులకు సంబంధించి 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అదే విధంగా కొనసాగిస్తామని మంత్రి చెప్పారు. త్వరలోనే ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తామని చెప్పారు. ఇక, భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ళ కోసం లాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అవసరాన్ని, ప్రాంతాన్ని బట్టి వాటి సంఖ్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తారుమారు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందుపరుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసుకుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నామని మంత్రి అన్నారు. 2014 కి ముందు పాస్ బుక్కులు కలిగి ఉండి.. అనుభవదారుడిగా పొసిషన్‌లో ఉన్నవారు ధరణి తరువాత రోడ్డున పడ్డారన్న మంత్రి.. భూ భారతిలో పట్టాదారులు, అనుభవదారులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఇక, రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డులతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత మూడేండ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయని, ఆ తప్పుల్ని బీఆర్‌ఎస్‌ ప్రజలపై బలవంతంగా రుద్దిందన్నారు. ఇప్పుడు అలా జరగకుండా మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తామని చెప్పారు. రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అధికారులతో పాటు తాను, సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన కనుగొంటామని పొంగులేటి హామీ ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు 2020 ఆర్వోఆర్ చీకటి చట్టాన్ని ప్రజలపై రుద్దారని ఆక్షేపించిన పొంగులేటి.. పూర్తి అవినీతితో నిండిపోయిన ఈ చట్టం మూడేండ్లకే నూరేండ్లు నిండిపోయేలా ప్రజలే మార్గనిర్దేశం చేశారన్నారు. అందుకే అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకొస్తున్న భూ-భారతి చట్టం కనీసం వందేళ్ళు వర్ధిల్లుతుందని ఈ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నదన్నారు.

భూ-భారతి ప్రత్యేకతలు :

– ఆరు మాడ్యూళ్ళు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మాడ్యూళ్ళకు కుదించారు.
– 11 కాలమ్‌లు : గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాలమ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేయబోతున్నారు.
– డిస్‌ప్లే : గత ప్రభుత్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌ప్లే చేస్తున్నారు.
– ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ఎవరైనా భూ భారతి ద్వారా ప్రభుత్వానికి తెలియ చేయవచ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందించారు.
– భూ-భారతిలో దరఖాస్తు చేసుకున్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబర్లకే అప్‌డేట్స్ వెళ్ళే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
– 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూముల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేయనున్నారు.
– ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని మంత్రి పొంగులేటి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో స్పష్టం చేవారు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామన్నారు.

కొత్త చట్టం రైతులకు చుట్టమన్న మంత్రి :

కొత్త రెవెన్యూ చ‌ట్టం.. రైతుల‌కు చుట్టంగా మార‌నుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూమి ఉన్న ప్ర‌తి రైతుకు ఈ చ‌ట్టంతో పాస్ పుస్త‌కాలు వస్తాయన్నారు. మ్యుటేష‌న్‌లో త‌ప్పు జ‌రిగితే అప్పీల్ చేసుకునే అవ‌కాశం ఈ చ‌ట్టం క‌ల్పిస్తోందన్నారు. రిజిస్ట్రేష‌న్ చేసుకున్న త‌ర్వాత వెనువెంట‌నే మ్యుటేష‌న్‌, పాస్ బుక్‌ మంజూరు జరిగిపోతాయన్నారు. మ‌నిషికి ఆధార్ మాదిరిగా.. భూ య‌జ‌మానుల‌కు భూధార్ ఇవ్వ‌నున్నామని చెప్పారు. భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి జిల్లా స్థాయిలోనే రెండు అంచెల అప్పీల్ వ్య‌వ‌స్థ‌ను, ప్ర‌త్యేకంగా ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటుచేయబోతున్నామని పొంగులేటి చెప్పారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంతో గ్రామానికో రెవెన్యూ అధికారితో రెవెన్యూ సేవ‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com