– అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణలో సామాన్యుల భూముల ల పరిరక్షణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభారతి చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బుధవారం శాసనసభలో మంత్రి పొంగులేటి.. భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటువంటి అద్భుతచట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించడం మరచిపోలేని విషయమని అన్నారు. 1971లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు ఉపయోగపడిందని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కూడా ప్రజోపయోగంగా ఉపయుక్తమయ్యిందని తెలిపారు. తర్వాత అర్ధరాత్రి నాలుగు గోడల నడుమ రూపొందిన ధరణి చట్టం వలన సమస్యలు పరిష్కారం కాకపోగా లక్షలాది సమస్యలను తెచ్చిపెట్టిందని చెప్పారు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లు ధరణి పోర్టల్‌తో లెక్కలేనన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వివరించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, నాటి ప్రతిపక్షనేత , నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి , నేటి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పాదయాత్రల సందర్బంగా ధరణిని అరేబియా సముద్రంలో కలుపుతామని ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆమేరకు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, ఒక్క గుంట భూమి ఉన్న వారు కూడా తమను నమ్మారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకుగాను ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతిని రూపొందించామని చెప్పారు. తాము ఆగస్టు 2న ముసాయిదాను ప్రవేశపెట్టడమేగాక ప్రత్యేకంగా 40 రోజుల పాటు వెబ్ సైట్‌లో పెట్టి ప్రజాప్రతినిధులు,కవులు , మేధావులు, విశ్రాంత అధికారుల సలహాలు సూచనలు స్వీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు 7 పేజీలు, వినోద్‌రావు 5 పేజీల సలహాలు . సూచనలు చేశారని వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. 33 జిల్లాలలో ఒక్కోరోజు ప్రత్యేక చర్చావేదికలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 18 రాష్ట్రాలలోని ఆర్వోఆర్‌లను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని భూభారతిలో పొందుపరిచామని మంత్రి తెలిపారు
ధరణ కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కేసముద్రం మండలం నారాయణపురంలో కె. రవి అనే ఎంపీటీసీ సభ్యులు భూ సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలందరి దృష్టికి తీసుకువెళ్లారని, ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదని చెప్పారు. అంతేగాక సర్వేనెంబర్లు 149,150, 154,156, 168 తదతరాల్లోని 1398 ఎకరాల భూమి తరతరాలుగా అక్కడి గిరిజనుల సాగుబడిలో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణి -2020 ఆర్వోఆర్ చట్టం వచ్చాక వారి హక్కులకు భంగం వాటిల్లేలా సదరు భూములు అటవీ భూములని తేల్చిచెప్పారని దీంతో గిరిజనులు తీవ్ర మనోవేదననకు గురయ్యారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 4 నెలల పాటు రిజిస్ట్రేషన్‌లు ఆపివేశారని, దీంతో భూములు అమ్ముకొని కుటుంబంలో పెళ్లిళ్లు, చదువుల కోసం ఖర్చుచేద్దామనుకొనే సామాన్య రైతులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని మంత్రి పొంగులేటి వివరించారు.
భూభారతి బిల్లుకు సంబంధించి 22, 23 సార్లు అభిప్రాయాలు తీసుకున్నామని, అందువల్లే బిల్లు ప్రవేశపెట్టడంలో .జాప్యం జరిగిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలకు పూర్తిస్ధాయిలో ఉపయోగపడేలా బిల్లు తయారుచేసేందుకు కృషి చేశామని, సాదాసీదా బిల్లును ప్రజలపై రుద్దే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.
భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుందన్న మంత్రి.. తరతరాలుగా మనిషి జీవితానికి, భూమికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. భూమి పేదరికాన్ని దూరం చేస్తుందని, ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుందిని, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఇస్తుందన్నారు. గ్రామాల్లో ఇప్పటికీ భూమే ప్రధాన జీవనాధారమని పొంగులేటి అన్నారు. భూమిని నమ్ముకుని బతికే కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలదని, కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించిందని ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1971లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్టం 49 ఏండ్లు విజయవంతంగా అమలైందని గుర్తుచేశారు. ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ లాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు ఒక భద్రత, భరోసా అన్న మంత్రి.. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు. కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 ఆర్వోఆర్ చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో మూడేండ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయని పరోక్షంగా కేసీఆర్‌ను విమర్వించారు. ఉన్న నాలికకు మందేస్తే కొండ నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైందన్నారు. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావాల్సినవి కోర్టుల దాకా వెళ్ళాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగు గోడల మధ్య కూర్చుని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా మన నెత్తిమీద రుద్దారని ఆరోపించారు. ధరణి మానవ సంబంధాలను సైతం దెబ్బతీసిందని, మనుషుల మధ్య దూరాన్ని పెంచిందన్నారు. భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసిందని, కాళ్ళకింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదనను చెప్పుకోడానికీ మార్గం లేకుండా చేసిందన్నారు. అందుకే తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నికల సమయంలో ధరణిని అరేబియా మహా సముద్రంలో వేస్తామని హామీ ఇచ్చారన్నారు. తాము ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారని కృతజ్ఞతలు తెలిపారు. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మా సహచర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని, ఇప్పుడు భూ-భారతిని తీసుకొస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ధరణి కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి భూ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొంగులేటి. అనేకసార్లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రెవెన్యూ చట్టాలను ఈ కమిటీ అధ్యయనం చేసిందన్నారు. ఆనాటి దొరలు గడీల్లో కూర్చుని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్టు బిల్లును ఇదే అసెంబ్లీలో ఆగస్టు 2న ప్రవేశపెట్టామన్నారు. ప్రజల నుంచి చట్టం రావాలనే ఉద్దేశంతో అదే రోజున సీసీఎల్ఏ వెబ్‌సైట్‌లో కూడా ముసాయిదా బిల్లును అందుబాటులో ఉంచామన్నారు. దాదాపు పాతిక రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, రైతుసంఘాల ప్రతినిధులు, మేధావులు, సామాన్య ప్రజానీకం, రిటైర్డ్ అధికారుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించామని, అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను స్వీకరించారని చెప్పారు. చివరకు 2020 చట్టంలో ప్రధాన పాత్ర పోషించిన తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచనలు కూడా స్వీకరించామని పొంగులేటి గుర్తు చేశారు. ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని కూడా అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సభలో భూ-భారతి బిల్లును ప్రవేశపెడుతున్నామని సభ్యుల హర్షధ్వానాల మధ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.