జైల్లో ఖైదీ కోసం గంజాయి సరఫరా చేస్తున్న ఒక ఫార్మసిస్టును పోలీసులు పట్టుకున్నారు. ఇంటి దొంగే ఈ విధంగా నేరాలకు పాల్పడ్డ సంఘటన విశాఖపట్నం కేంద్ర కారాగారంలో చోటు చేసుకుంది. జైలు ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న కడియం శ్రీనివాసరావు కారాగారంలోకి గంజాయి తీసుకువెతూ పోలీసులకు పట్టుబడ్డాడు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు డిప్యూటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారానికి వచ్చారు. గుర్రాల సాయి అనే రిమాండ్ ఖైదీకి చికిత్స కోసం జైలుకు వచ్చినప్పుడు అతనితో శ్రీనివాసరావుకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఉపయోగించుకుని సాయి తన తమ్ముడు గంజాయి ఇస్తాడని అది తీసుకుని తనకు ఇస్తే డబ్బులు ఇస్తానని శ్రీనివాసరావుకి ఆశచూపాడు. డబ్బుకు ఆశపడ్డ శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా తన లంచ్ బాక్స్ లో గంజాయి తీసుకువచ్చి సాయికి ఇస్తున్నాడు. మంగళవారం జైలు ప్రధాన ద్వారం వద్ద అధికారులు నిర్వహించిన రొటీన్ తనిఖీల్లో శ్రీనివాసరావు లంచ్ బాక్స్ లో 95 గ్రాముల గంజాయిని గుర్తించారు. దీంతో అరిలోవ పోలీసులు శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
- Advertisement with us -