పోలవరానికి అనుమతులు తెచ్చింది వైఎస్సారే
అసత్యాలు, అర్ధ సత్యాలతో వైఎస్ ఘనతను మరుగు పరచలేరు
1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా మీరు ఒక్క రూపాయి కూడా పోలవరానికి ఖర్చు పెట్టలేదు
పవిత్రమైన శాసనసభ సాక్షిగా పోలవరాన్ని వైఎస్.రాజశేఖరరెడ్డి అస్తవ్యస్తం చేశాడని చెప్పడం తనకు బాధ కలిగించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గురువారం ఒక లేఖ రాశారు. పోలవరాన్ని 2027 కల్లా పూర్తి చేస్తానని శాసనసభ సాక్షిగా మీరు మరోసారి ప్రతినపూనినందుకు అభినందనలు అంటూనే 1995 నుంచి 2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న మీరు నిర్లక్ష్యం చేసిన విషయం సత్యమని ఆ లేఖలో ఎత్తి చూపారు. మీరు సీయంగా ఉన్న ఆ కాలంలో పోలవరం నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు.
రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే పోలవరం పరుగులు తీసిందనేది జగమెరిగిన సత్యమని అన్నారు. పోలవరానికి కావల్సిన అతి ముఖ్యమైన పర్యావరణ అనుమతులతో సహా వివిధ అధికారిక అనుమతులు, ఎస్టిమేషన్లు అన్నీ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసి పెట్టారని కేవీపీ ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటును కూడా చంద్రబాబుకు రాసిన లేఖతో పాటు జతచేసి పంపారు. పోలవరం విషయంలో మీ కృషిని చెప్పుకోవడంలో తప్పులేదు కానీ ఇతరుల కృషిని అవహేళన చెయ్యడం కరెక్ట్ కాదని ఆలేఖలో హితవు పలికారు. ఇక అసత్యాలు, అర్ధ సత్యాలతో పోలవరం విషయంలో వైఎస్ చేసిన కృషిని మరుగునపరచ లేరనే చారిత్రక సత్యాన్ని గుర్తించమి చంద్రబాబుకు ఘూటుగా లేఖ రాశారు కేవీపీరామచంద్రరావు.