కలుపు సంహారక సమ్మేళనం అయిన గ్లైపోసెట్ గడ్డి మందు రాష్ట్రంలో ప్రతియేటా వందలాదిమంది మనుషుల ప్రాణాలను తీస్తూ, భూసారాన్ని దెబ్బ తీస్తోంది. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బ తింటోంది. ముఖ్యంగా కూలీల ఖర్చులు పెరగడంతో కలుపు కోసం ఈ గడ్డి మందును రైతులు విరివిగా వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రైతులు ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో క్షనికావేశానికి లోనై గడ్డిమందు తాగి ఆత్మహత్యలకు పాల్బడిన ఉదంతాలు కోకొల్లలు.
పురుగు మందుల నియంత్రణ చట్టం 1968 ప్రకారం ఏ మందునైనా కేవలం 60రోజులు మాత్రమే నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీర్ఘకాలం నిషేదించే అధికారం కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండడం గమనార్హం. మొదట మోన్ శాంటో కంపెనీ ఈ గడ్డి మందు తయారీని మొదలు పెట్టగా ప్రస్తుతం బేయర్ కంపెనీ ఈ మందు ఉత్పత్తి కొనసాగిస్తోంది. పురుగు మందుల మార్కెటింగ్ లో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న బహుళజాతి బేయర్ కంపెనీ గడ్డి మందు ద్వారా వేల కోట్లు సంపాదిస్తోంది. మానవాళికి పెనుసవాళ్లు విసురుతున్న గడ్డి మందును నిషేదించాసాల్సిందే అనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ మందు కలిసిన పంటలు తినడంతో మనుషులకు క్యాన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు, అల్జిమర్స్ వ్యాధులతో పాటు అతి భయంకరమైన పార్కీన్సన్ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇంతటి విధ్వంసానికి కారణమవుతున్న గడ్డి మందును నిషేదించడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడం అనుమానాలకు తావిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ విషపు మందు వాడకం అధికంగా జరుగుతోంది. గడ్డి మందు విచ్చలవిడి అమ్మకాలను నియంత్రిస్తూ ఈ మందు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో ప్రజా చైతన్య సదస్సులు నిర్వహించాల్సిన భాద్యత వ్యవసాయాధికారులపై ఉంది.
అయితే ప్రభుత్వాలు, పాలకులు కళ్ళు తెరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. కేంద్రప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిసారించి గ్లైపోసెట్ గడ్డి మందును నిషేధించి ప్రజల ప్రాణాలను, భూసారాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.