తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో అందరినీ భాగస్వామ్యం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అయితే, అతిథులను కూడా ఎవరినీ విస్మరించొద్దన్న ఆలోచనలో ప్రముఖులందరినీ ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రజాపాలన విజయోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించింది. రాష్ట్రప్రభుత్వం తరపున హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కార వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గవర్నర్‌ను కలిసి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. వేడుకలకు సంబంధించిన ఆహ్వానపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్బంగా గవర్నర్‌కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కూడా రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసింది. హైదరాబాద్ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో బస చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని హైదరాబాద్ ఇంచార్జ్‌మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు కలిశారు. ప్రజాపాలన విజయోత్సవాల ఆహ్వాన పత్రికను అందిజేశారు. వేడుకల్లో పాల్గొనాలని కోరారు.