తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఈరోజు(బుధవారం) బీఆర్ఎస్ పార్టీ
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ని హైదరాబాద్ నందీనగర్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. స్వామి వారి ప్రసాదాన్ని కేటిఆర్ కి అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడుని కేటిఆర్ శాలువాతో సత్కరించి శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు బీఆర్ నాయుడుకి కేటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ నాయుడుకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ లో ఒకచోట, సిరిసిల్లలో రెండు చోట్ల గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు పూర్తి అయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని వాటి అభివృద్ధికి టిటిడి తరఫున తోడ్పాటు అందించాలన కోరగా.. బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ భక్తుల దర్శనాల విషయంలో, ఆలయాల నిర్మాణం, అభివృద్ధి విషయంలో సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.