పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిన చందంగా కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, కిరాయిలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేోయగానే.. 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారని విమర్శించారు. వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని చెప్పారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారని మండిపడ్డారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమయిందని విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుంది. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తోందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.