హమాస్, హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం ఇప్పుడు వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. అక్టోబర్ 7 దాడుల్లో ఇజ్రాయెల్ ప్రజలను అత్యంత దారుణంగా హతమార్చినందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకపడింది. తాము కేవలం ఉగ్రవాదులు నక్కి ఉన్న ప్రాంతాలపైనే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నా.. పాలస్తీనా వర్షన్ మరోలా ఉంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 40 వేల మందికిపైగా మృతి చెందినట్టు ప్రకటించింది.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. నెతన్యాహూతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్‌పై, అలాగే హమాస్ నేత ఇబ్రహీం ఆల్ మస్రీకి ఈ వారెంట్ జారీ చేసింది. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చర్యల కొనసాగింపు ఆరోపణలపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి.
తమ ప్రధానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై ఇజ్రాయెల్ స్పందించింది. విదేశాంగ మంత్రి గిడియాన్ ఈ వారెంట్‌పై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అసంబద్ధ అరెస్ట్ వారెంట్లను ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం చట్టబద్ధతను కోల్పోతోందని విమర్శించారు.
ఖండాంతర క్షిపణులతో రష్యా దాడులు!
మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత జో బైడెన్ వెళుతూ వెళుతూ పెద్ద కుంపటే పెట్టినట్టు కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పైకి అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్‌ను ప్రయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రష్యాపైకి క్షిపణులను ప్రయోగించింది ఉక్రెయిన్. దీంతో రష్యా కూడా తన అమ్ములపొదిలో నుంచి ఖండాంతర క్షిపణులను బయటకు తీసింది. ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. ఈ విషయంపై రష్యా ఇంకా పెదవి విప్పలేదు. ఉక్రెయిన్ మాత్రం తమపైకి ఖండాంతర క్షిపణులు దూసుకొచ్చాయని ప్రకటించింది. నష్టం జరిగిందా? దాడి ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం వెల్లడించలేదు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై వెయ్యి రోజులు దాటింది. ఇంత వరకు ప్రమాదకర ఆయుధాలను వాడలేదు. ఇప్పుడు వాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు జో బైడెన్. యుద్ధం మరింత తీవ్రతరమైతే ఆ క్రెడిట్ అంతా అమెరికాకే దక్కనుంది. అమెరికా బాటలోనే బ్రిటన్ నడిచింది. దీంతో రెండు రోజుల క్రితం బ్రిటన్ సరఫరా చేసిన లాంగ్ రేంజ్ స్టార్మ్ షాడో క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించింది.