ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్‌మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో HCITI ఫేజ్-1లో రూ.3446 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రహదారులు, జంక్షన్ల సుందరీకరణకు ₹150 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలో వరదనీరు నిలవకుండా వర్షపు నీటి సంరక్షణ, వరద నీటిని నియంత్రించే పనులకు ₹17 కోట్ల అంచనాలతో చేపట్టే పనులను రేవంత్ ప్రారంభించారు.
హైదరాబాద్ జల మండలి అధ్వర్యంలో నిర్మించిన మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు ప్రారంభించారు. వీటిని రూ.669 కోట్ల అంచనాలతో చేపట్టారు. తాగునీటి సరఫరాకు అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ వివిధ ప్రాంతాల్లో రూ.45 కోట్లతో చేపట్టిన 19 రిజర్వాయర్లను కూడా వర్చువల్ పద్ధతిలలో సీఎం రేవంత్ ప్రారంభించారు. హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రేటర్ సిటీలో రూ.1500 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేసే ప్యాకేజీతో పాటు గతంలో పెండింగ్లో ఉన్న పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానంతో కొత్త ఆన్లైన్ బిల్డింగ్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ సాఫ్ట్‌వేర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.